
..ఇక ఎన్నికలెందుకు?
స్థానిక ఎన్నికల్లో టీడీపీ తీరుపై గవర్నర్‌కు జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు
జెడ్‌పీ, ఎంపీపీ, మునిసిపల్ అధ్యక్ష పీఠాల కోసం దౌర్జన్యం చేస్తోంది
కలెక్టర్లు, ఎస్‌పీలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు బాహాటంగా వీరంగం వేస్తున్నారు
టీడీపీ దాడులపై పోలీసులు కేసులు నమోదు చేయటానికీ నిరాకరిస్తున్నారు
రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
హైదరాబాద్: ‘‘స్థానిక సంస్థల్లో ఇతర పార్టీ గుర్తులపై ఎన్నికైన వారిని అధికారపక్షం భయపెట్టి, ప్రలోభపెట్టి తమ వైపుకు లాక్కొని వారితో ఓట్లేయించుకునేట్లయితే ఇక ప్రజాస్వామిక వ్యవస్థకు అర్థమేముంది? ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేముంది? ఆ పదవులకు అధికారపక్షమే నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ పాల్పడిన దౌర్జన్యాలపై జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేలతో ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయా జిల్లాల్లో ఈ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడిన ఘటనలపై ల్యాప్‌టాప్‌లో విడియోను ప్రదర్శించి చూపడమే కాకుండా సమగ్ర సమాచారంతో కూడిన డీవీడీని, దానితో పాటు ఒక వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. జిల్లా కలెక్టర్, పోలీసుల సమక్షంలో వారి సహకారంతో అధికారపక్ష నేతలు ఎలా అక్రమాలకు పాల్పడిందీ ఆయన దృష్టికి తెచ్చారు. నెల్లూరు జిల్లా పరిషత్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వీరంగం, వైఎస్సార్ సీపీ జడ్‌పీటీసీలను వారు లాక్కుని వెళ్లిన దృశ్యాలను చూపించారు. అంతులేకుండా సాగుతున్న అధికారపక్షం అక్రమాలు, ఆగడాలను అరికట్టాలని గవర్నర్‌కు జగన్ విజ్ఞప్తిచేశారు. వీడియో దృశ్యాలను తిలకిస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా గొడవ చేస్తున్న వారి వివరాలను నరసింహన్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను గవర్నర్‌కు వివరించిన అనంతరం జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇంతటి దారుణానికి దిగడం ఎంతవరకు సమంజసమని టీడీపీపై ధ్వజమెత్తారు. వేరే పార్టీ బీ ఫారంపైన ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను లాక్కోవాలనే ఆలోచన ఎక్కడా ఎవరూ చేసి ఉండరని పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబు సంతోషించకుండా మండల, జిల్లా పరిషత్, మునిసిపల్, కార్పొరేషన్ల మేయర్, చైర్మన్ పదవులను కూడా ఇతర పార్టీల నుంచి లాక్కోవాలని ప్రయత్నించడం దౌర్భాగ్యం. స్థానిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.. వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎన్నికైన వ్యక్తులను భయపెట్టి, ప్రలోభపెట్టి, కిడ్నాప్ చేసి వాళ్లతో బలవంతంగా టీడీపీకి ఓట్లేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే నేరుగా జడ్‌పీటీసీలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతోందో ప్రజాస్వామ్యంలో ఉన్న వారంతా ఆలోచించాలి’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే...
ఈ తరహాలో చైర్మన్లు, అధ్యక్ష పదవులను లాక్కోవాలనుకుంటే ఇక పార్టీ గుర్తులపై ఎన్నికలెందుకు జరిపారు? ఆ అవసరం ఏముంది? మీరే (అధికారపక్షమే) నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా! ఇదంతా చూస్తూంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అన్నది అర్థంకావడం లేదు.
ప్రజలిచ్చిన తీర్పుననుసరించి మాకున్న బలం ప్రకారం వైఎస్సార్ సీపీ నాలుగు జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెల్చుకోవాలి. అయితే ఒక్క కడప జిల్లా చైర్మన్ పదవి మాత్రమే మాకు దక్కింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోరంకు కావాల్సిన సభ్యులున్నా అధికారపక్షం ఎన్నికను వాయిదా వేయించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక పథకం ప్రకారం పూర్తిగా గొడవలు చేయించారు. కలెక్టర్ సమక్షంలో ఎస్‌పీ సహకారంతోనే అధికారపక్షం దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే ఇక చెప్పుకోవడానికి ఎక్కడికి పోవాలి?
వైఎస్సార్ సీపీకి ఉన్న బలం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 239 మండల పరిషత్ అధ్యక్ష పదవులు గెలవాల్సి ఉంటే.. కేవలం 200 చోట్ల మాత్రమే గెలుపొందాం. 36 మునిసిపాలిటీల్లో మాకు మెజారిటీ ఉంటే 19 చైర్మన్ పదవులను మాత్రమే గెలిచాం. ఇక నాలుగు జడ్‌పీ చైర్మన్ పదవులు రావాల్సి ఉంటే ఒక్క చోట మాత్రమే గెలిచాం. మా పార్టీకి బలం ఉన్నా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినా కూడా ప్రలోభాలు, అపహరణలకు పాల్పడుతూ భయపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ పదవులను కూడా చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తే చేయడం ఎంత వరకు ధర్మం?
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను చంపించారు. 110 మందిని తీవ్రంగా గాయపరిచారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారి చీనీ చెట్లను టీడీపీ వాళ్లు నరికివేయించారు. సీఎంకు ప్రమేయం లేకపోతే ఈ నేరాలను ఎందుకు ఖండించలేదు?
ఈ వ్యవస్థలో ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో?!
స్థానిక ఎన్నికల తీరే ఇలా ఉంటే ఇక ఆళ్లగడ్డ, నందిగామ అసెంబ్లీ, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో?! ఇంతటి భయాందోళలనల మధ్య ఎస్‌పీలు, కలెక్టర్లందరూ కూడా చంద్రబాబు ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఉంటే నిజంగా ఈ వ్యవస్థలో ఆ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారోనని అనుమానం కలుగుతోంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులు చూస్తూంటే ఆంధ్ర రాష్ట్రంలో బతకాలంటే నిజంగా భయమేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చాక ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేకుండా నామినేట్ చేసుకుంటారు. ఇది భావితరాలకు తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది. ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించాలి. బాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వైఖరి మార్చుకోవాలి.
మీకు ఓట్లేసిన ప్రజలే ప్రతిపక్షంగా మారతారు
అధికారం మత్తులో ఉన్న చంద్రబాబు స్థానిక సంస్థల అధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అపుడు మీకు ఓట్లేసిన ప్రజలే నిజమైన ప్రతిపక్షంగా మారతారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చలేని స్థితిలో ఉన్న మీరు (చంద్రబాబు) అసలు మనుషులు కాదనిపిస్తోంది. ప్రజలకు అబద్ధాలు చెప్పారు. మోసం చేశారు. హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్న మీరు వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని పన్నాగాలు పన్నుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండేది ప్రజా ప్రతినిధులు కాదు.. ఓట్లేసిన ప్రజలే ప్రతిపక్షమై చొక్కాలు, కాలర్లు పట్టుకునే పరిస్థితి వస్తుంది. రుణమాఫీలు చేస్తానని చెప్పి, ఆ పని చేయకుండా వాళ్లలోకి వెళితే ఆ రైతులంతా చొక్కా పట్టుకుంటారు. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇవ్వకపోతే నిరుద్యోగులు, విద్యార్థులు కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తారు. బాబు హామీలు కనుక నెరవేర్చకపోతే మున్ముందు టీడీపీకి డిపాజిట్లు రాని విధంగా ప్రజలే తీర్పు చెప్తారు.
రాష్ట్రపతి, ప్రధానిలకూ ఫిర్యాదు చేస్తాం...
‘‘అధికార పార్టీ దౌర్జన్యాలకు గురైన వారిలో 50 శాతం మంది ఎస్సీలు, మహిళలేనని చెప్పడానికి బాధేస్తోంది. మేం ఇంతటితో ఆగబోం. రాబోయే రోజుల్లో గవర్నర్‌తో మరిన్నిసార్లు కలుస్తాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినపుడు గవర్నర్ ఎలా స్పందించారని ప్రశ్నించగా.. ‘‘బాగా స్పందించారు. చర్య తీసుకుంటారనే మేం ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రజాస్వామ్యం ఖూనీ అయినపుడు చూస్తూ ఉండజాలరు’’ అని ఆయన బదులిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో జ్యోతుల నెహ్రూ, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆర్.కె.రోజా, గిడ్డి ఈశ్వరి, వంతెల రాజేశ్వరి, కోన రఘుపతి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, పాముల పుష్పశ్రీవాణి, బూడి ముత్యాలనాయుడు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆదిమూలం సురేష్, ఐజయ్య, మణిగాంధీ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అత్తారు చాంద్‌బాష, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఉన్నారు.
పోలీసుల వేధింపులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కర్రా బాలరాజు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గిద్దలూరు సొసైటీ అధ్యక్షుడు వైజా భాస్కర్‌రెడ్డి మృతి సందర్భంగా షోరూం ధ్వంసం, పోలీసు జీపు దగ్ధమైన కేసుల్లో బాలరాజుతో పాటు మరో 12 మందిని రోజూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి రాత్రికి ఇంటికి పంపిస్తున్నారు. షోరూంను, జీపును కాల్చింది తానేనని ఒప్పుకోవాలంటూ పోలీసులు బెదిరిస్తుండటంతో, తనపై కేసు నమోదు చేస్తారని భయపడి నిద్ర మాత్రలు మింగాడు. స్ఫృహ కోల్పోయిన ఆయనను బంధువులు స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేశ్ తెలిపారు.