రేపు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సోమవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, జెడ్సీ చైర్మన్ ల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, నిబంధనలను ఉల్లంఘించి ప్రలోభాలకు గురిచేసిందని, బెదిరింపులకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్‌ఫ్యూజన్ లో ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన బాబు.. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కన్‌ఫ్యూజన్ లో ఉన్న చంద్రబాబు.. ప్రజలను కూడా కన్‌ఫ్యూజన్ కు గురిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు పాలనను.. ప్రజలు, ప్రకృతి కూడా అసహ్యించుకుంటున్నాయన్నారు. ప్రజల తరుపున పోరాడటానికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.