ప్రజాస్వామ్య విలువలు ఖూనీ | YS jagan mohan reddy fired on CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య విలువలు ఖూనీ

Published Sat, Apr 1 2017 2:36 AM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM

ప్రజాస్వామ్య విలువలు ఖూనీ - Sakshi

ప్రజాస్వామ్య విలువలు ఖూనీ

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తీరుపై
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం


సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అధికారపక్షం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందని, సభ జరిగిన తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఆయన తన చాంబర్‌లో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ జరిగిన తీరును, ప్రజా సమస్యల పట్ల అధికారపక్షం వ్యవహరించిన తీరును జగన్‌ తీవ్రంగా తప్పు పట్టారు.   ఇంకా ఆయనేమన్నారంటే...

అడుగడుగునా అప్రజాస్వామిక పోకడలే..
‘‘సభ జరిగిన తీరుపై నేను చెప్పడం కన్నా... అది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో చెప్పడానికి మీరే (మీడియా) మొట్టమొదటి సాక్షులు. సభ చాలా దారుణంగా జరిగింది. చిట్ట చివరి రోజు కూడా మేం లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఈ సభలో అధికారపక్షం వాళ్లు నన్ను ఇష్టమొచ్చినట్లు దూషించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు, ఏపీ సీఎం చంద్రబాబు చూస్తూ చాలా బాగా ఆనందించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు టీడీపీ నుంచి అందరూ నన్ను తిట్టేవాళ్లే.... నేను మైక్‌ తీసుకుని రెండు మాటలు మాట్లాడేటప్పటికి పదే పదే కట్‌ చేసేస్తు న్నారు. నేను మాట్లాడుతున్నపుడు సీఎం మూడు సార్లు, మంత్రులు అచ్చెన్నాయుడు నాలుగైదు సార్లు, అయ్యన్న పాత్రుడు రెండు సార్లు జోక్యం చేసుకుని అడ్డు తగులుతూ మాట్లాడారు. నాపై వారు చేసినవన్నీ వ్యక్తిగత ఆరోపణలే... అన్నీ అబద్ధాలతో కూడుకున్నవే. వాటిని నిరూపించక పోతే పదవులకు రాజీనామా చేస్తారా? అని నేను విసిరిన చాలెంజ్‌ను స్వీకరించే ధైర్యం వాళ్లకు లేదు.

ఏ చర్చ చూసినా పక్కదోవ పట్టించడమే!
అసెంబ్లీలో మేము ఏ అంశాన్ని లేవనెత్తినా దానిపై చర్చను అధికారపక్షం పక్కదోవ పట్టిస్తోంది. ఆక్వా పార్కు కాలుష్యం వల్ల చనిపోయిన బాధితుల సమస్యపై ఇవాళ చర్చ ఎలా జరిగిందో చూశారు కదా!  ఇదొక్కటే కాదు.. అధికారులపై టీడీపీ నేతలు దాడి చేసిన ఉదంతం, దాని కన్నా ముందు అగ్రిగోల్డ్‌ కుంభకోణం, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజి వ్యవహారం ఇలా.. ఏ అంశంపై చూసినా ప్రభుత్వ వైఖరి ఒకేలా కనిపిస్తోంది.  తప్పించుకోవడం.. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం.. ఏ అంశంపై కూడా సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. అగ్రిగోల్డ్‌ విషయంలో హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కోరాం, కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అగ్రిగోల్డ్‌కు చెందిన, బయట ఉన్న ఇంకా కొన్ని ఆస్తులను కూడా వేలం పరిధిలోకి తీసుకు రావాలని కోరితే ప్రభుత్వం దానికీ ఒప్పుకోలేదు.

అధికారపక్షానికి ప్రజాసమస్యలు పట్టవు..
ప్రతిపక్షంగా మాకేమో ప్రజాసమస్యలే మాకు సమస్యలు... కానీ అధికారపక్షానికి జగనే ఒక సమస్య, అన్నట్లుగా వ్యవహరించారు. మేం ప్రజా సమస్యలపై మాట్లాడితే వారు (టీడీపీ) మాత్రం జగనే తమ సమస్య అన్నట్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం చేయించేందుకు మేం పడ్డ ఆరాటం, తపనను చంద్రబాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాను ప్రత్యేకహోదాకు వ్యతిరేకిని అని చంద్రబాబు ఈ సమావేశాల్లో స్పష్టంగా బయటపడ్డారు. మా పార్టీ నుంచి ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చంద్రబాబు కండువాలు కప్పి తీసుకెళ్లారు. స్పీకర్‌ సమక్షంలోనే సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరినీ టీడీపీ బెంచీల వైపు కూర్చోబెట్టి సభను నడిపిన తీరు ఈ సమావేశాల్లో చూశాం. ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనుక చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పైన దేవుడున్నాడు.. అంతిమంగా గుణపాఠం నేర్పడానికి ప్రజలున్నారు. వారే తుది నిర్ణయం తీసుకుంటారు.   

అబద్ధాలు, మోసాలు కాగ్‌ బయటపెట్టింది..
వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ‘కాగ్‌’(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్రం వ్యవసాయ రుణ విముక్తికి రూ.4,300 కోట్లు కేటాయించింది. అందులో రూ.743 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ.3,557 కోట్ల మొత్తాన్ని ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్‌ చేశారు. అందులో ఉద్యానవన పంటల రుణ మాఫీ కోసం 2015–16లో నిధులేమీ కేటాయించలేదు. ఖర్చుచేసిన రూ.743 కోట్ల మొత్తంలో కూడా రూ.375 కోట్ల నిధులను సంవత్సరం చివర్లో రైతు సాధికార సంస్థ పీడీ ఖాతాకు సర్దుబాటు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు  పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేని ప్రాజెక్టు అని కాగ్‌ అంది’ అని జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement