►ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందేంటి.. ఇవాళ చేస్తుందేమిటి?
►అబద్దాలతో మళ్లీ చంద్రబాబు మోసం చేస్తారు..
►దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి
►ధర్మం, న్యాయంవైపు నిలబడండి..
►చంద్రబాబు సీఎం అయ్యాక వర్షాలు కూడా పడటం లేదు..
►నాలుగో రోజు రోడ్ షో లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
నంద్యాల: రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ఆయన మాటలు ఏమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు మిర్చి పంటను కూడా నడిరోడ్డుపై తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని, చివరకు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగో రోజు శనివారం వైఎస్ జగన్ రోడ్ షో... గోస్పాడు, శ్రీనివాసపురం, యాలూరు మీదగా కొనసాగింది.
ఉద్యోగాల పేరుతో యువతను కూడా చంద్రబాబు మోసం చేశారని, జాబు రవాలంటే బాబు రావాలి అన్నారని, లేదంటే రూ.2వేల నిరుద్యోగ భృతి అన్నారు...ఏమైందని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకూ ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.76వేలు బాకీ పడ్డారన్నారు. పేదవారిని కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదని, ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారని, ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? అని అడిగారు. చంద్రబాబు సీఎం కాకముందు రేషన్ షాపుకు వెళితే తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారని, కానీ బాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందేమిటి?..ఇప్పుడు చేస్తుందేమిటి?.. కర్నూలుకు ఎయిర్‌పోర్టు, ఉర్దూ వర్శిటీ, స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, ఫుడ్ పార్క్, ఇండస్ట్రీయల్ సిటీ అన్నారని, అంతేకాకుండా రైతులను మోసం చేసేందుకు గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారని, వీటిలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు మళ్లీ వస్తున్నారని, మరోసారి మోసం చేసేందుకు మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తారని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాలకు ఇది చేస్తా... అది చేస్తానంటూ మోసం చేస్తారని, హామీల పేరుతో ఇలా మోసాలు చేసే చంద్రబాబును ప్రశ్నించకూడదంట. ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పులేదు. చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపే చానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన పెద్ద కుటుంబమే. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ ప్రజల గుండెల్లోఉన్నాయి.
జగన్ అబద్ధం ఆడడు.. ఏం చెప్తే అదే చేస్తాడు. జగన్ నాన్నాల రైతుల గురించి, అక్కచెల్లెమ్మల గురించి ఆలోచిస్తాడు. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే.. ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తారు. మూటలు, మూటలు డబ్బులు పట్టుకుని వస్తారు. రూ.5వేలు ఇచ్చి, దేవుడి పటంపై ప్రమాణం చేయించుకుంటారు. అలాంటి సమయంలో దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి. ధర్మం, న్యాయంవైపు నిలబడండి. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతా. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించండి’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.