
మంగళవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో అనిల్ సింఘాల్
సాక్షి, తిరుపతి/గన్నవరం: నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. కొండపైన ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమమైనా చేపట్టే ముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడి ఆశీర్వాదం కోరనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వారి కోసం కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరీ.. వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్చాలను స్వీకరించారు. అంతకుముందు వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5.20కు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.
దారి పొడవునా జననేత కోసం జనం
రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు పయనమైన వైఎస్ జగన్ కోసం గురవరాజుపల్లి, రేణిగుంట చెక్‌పోస్టు కూడలి, కరకంబాడి, మంగళం, లీలామహల్ కూడలి, అలిపిరి వరకు జనం బారులు తీరారు. కాన్వాయ్‌ని నెమ్మదిగా వెళ్లమని చెప్పి తన కోసం వచ్చిన వారందరికీ నమస్కరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. స్థానికులు సీఎం సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనేకమంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించగా.. మరి కొన్నిచోట్ల పువ్వులు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్ పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వైఎస్ జగన్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేడు కడపకు
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి వైఎస్సార్ జిల్లా కడపకు చేరుకోనున్నారు. అక్కడ పెద్ద దర్గాను దర్శించుకుంటారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment