మీ అన్నగా, తమ్ముడిగా  సాయం | YS Jagan Mohan Reddy Helped Autowala And Taxi Financially In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మీ అన్నగా, తమ్ముడిగా  సాయం

Published Fri, Jun 5 2020 4:42 AM | Last Updated on Fri, Jun 5 2020 8:42 AM

YS Jagan Mohan Reddy Helped Autowala And Taxi Financially In Andhra Pradesh - Sakshi

వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారులకు నగదు పంపిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు పేర్నినాని, అవంతి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ నడుపుతున్న వారందరికీ ఒక అన్నగా, తమ్ముడిగా ఆర్థిక సాయం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ గల వారికి గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రెండవ ఏడాది రూ.10 వేల చొప్పున నగదును జమ చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ అయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కొత్తగా 37,756 మంది ఈ పథకంలో లబ్ధిదారులయ్యారు. కలెక్టర్లు, మంత్రులు,  ప్రజాప్రతినిధులు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు నడిపేవారిని ఉద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

అందరికీ మంచి జరగాలి 
► గత ఏడాది అక్టోబర్‌ 4న వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏడాది కోవిడ్‌తో లాక్‌డౌన్‌ వల్ల బతకడం కష్టమైంది. ఆటోలు, ట్యాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి కాబట్టి వారికి మేలు చేయడం కోసం ఈ ఏడాది జూన్‌ 4నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
► ఎక్కడైనా, ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకంలో లబ్ధి కలగకపోతే ఆందోళన చెందొద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలని స్పష్టం చేశాం. అవినీతికి తావు లేకుండా ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. 
► ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాల్లో లేదా స్పందన యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే స్పందన హెల్ప్‌లైన్‌ నంబరు 1902కు కాల్‌ చేయాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే వచ్చే నెల 4వ తేదీన ఆర్థిక సహాయం చేస్తాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా.
ఆలోచించాను.. అమలు చేశాను..
► పాదయాత్ర సందర్భంగా 2018 మే నెలలో ఏలూరులో మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇన్సూరెన్సు కట్టాలి. అది కడితేనే ఫిట్‌నెస్‌  సర్టిఫికెట్‌ ఇస్తారు. ప్రీమియం ఎక్కువ కావడంతో డ్రైవర్లు ఇబ్బంది పడే వారు. ఎఫ్‌సీ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించే వారు. 
► అప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో డ్రైవర్లు వచ్చి నన్ను కలిశారు. ఎఫ్‌సీ కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేలు ఖర్చు చేయాలి. లేదంటే రోజుకు రూ.50 ఫైన్‌ ఎలా కడతారని ఆలోచించాను. ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈ సారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను.  
పాత బాకీల కింద జమ చేసుకోరు
► గత ఏడాది ఆటోలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్ల ఖాతాలో నగదు వేస్తున్నప్పుడు, దాన్ని పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేశాం. అప్పుడు దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేశాం. 
► ఈసారి రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈసారి 37,756 మంది కొత్త లబ్ధిదారులు చేరారు.
డబ్బులు అందిన సంతోషంతో అనంతపురానికి చెందిన రామలక్ష్మి

క్యాలెండర్‌ ప్రకారం సేవలు
► అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్‌ ప్రకటించాం. అందులో భాగంగా ఇవాళ (గురువారం) ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. 
► ఈ నెల 10వ తేదీన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు సహాయం అందిస్తాం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం, 24న కాపు నేస్తం, 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత లబ్ధి కలిగిస్తాం.
అన్ని వర్గాల వారికి న్యాయం 
► పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎస్సీలు 61,390 మంది, ఎస్టీలు 10,049 మంది, బీసీలు 1,17,096 మంది, ఈబీసీలు 14,590 మంది, మైనారిటీలు 28,118 మంది, కాపులు 29,643 మంది, బ్రాహ్మణులు 581 మంది, క్రైస్తవులు 1,026 మంది ఉన్నారు. 
► అందరూ కలిపి మొత్తం 2,62,493 మందికి ఈ ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర పథకంలో లబ్ధి చేకూరుస్తున్నాం.

గత ఏడాది లబ్ధి పొందలేకపోయిన వారికీ..
► గత ఏడాది 8,600 మంది మైనారిటీ కార్పొరేషన్‌ లబ్ధిదారులు, మరో 3,600 మంది బ్యాంక్‌ ఖాతాల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారికి ఆర్థిక సహాయం అందలేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అందువల్ల ఆ 12,200 మందికి గత ఏడాది మొత్తంతో పాటు ఈ ఏడాది సొమ్ము కూడా శుక్రవారం సాయంత్రంలోగా జమ చేస్తామని చెప్పారు.
► వైఎస్సార్‌ వాహనమిత్ర పథకంలో గత ఏడాది 2,36,334 మందికి లబ్ధి చేకూర్చగా, వారిలో 11,595 మంది వాహనాలు అమ్ముకున్నారని ఆయన వెల్లడించారు. దీంతో వారు అనర్హులు కాగా, 2,24,739 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. 
 ►ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 849 మంది అనర్హులుగా తేలారని చెప్పారు. మిగిలిన 37,756 మందిని అర్హులుగా గుర్తించామని, దీంతో ఈ ఏడాది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,493 కు చేరిందన్నారు.
 ►కార్యక్రమం ప్రారంభంలో వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, సీఎస్‌ నీలం సాహ్ని, రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు, పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ మేలు మరవలేం
నేను ఎంఏ చదివాను. ఉపాధి కోసం ఆటో తోలుతున్నా. ఇంత వరకూ నేను ఎప్పుడూ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందలేదు. తొలిసారి మీ ప్రభుత్వంలో గవర్నమెంటు సొమ్ము పది వేలు తిన్నాను సార్‌. గతంలో ఇన్సూరెన్స్, ఫిటినెస్‌ వంటి వాటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ ఖర్చులు మీరిచ్చిన డబ్బులతో పెట్టగలగుతున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇన్సూరెన్స్‌ కోసం బయట రూ.7,300 చెల్లిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా చేయిస్తే ఇంకా తక్కువ మొత్తంతోనే వీలవుతుంది. తక్కువ వడ్డీకి రుణాలిప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వర్గాల వారికి మీరు చేస్తున్న మేలు మరచిపోము. – భాగ్యలక్ష్మి, మహిళా ఆటో డ్రైవర్, అనంతపురం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement