ఒంగోలు టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టబోతున్న మనబడి నాడు–నేడు బహిరంగ సభకు ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం ముస్తాబైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా గురువారం ఒంగోలు రానున్నారు. మన బడి నాడు–నేడును ఇక్కడ నుండే ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నగరమంతలా పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయం 10–10 గంటలకు సీఎం ఒంగోలు చేరుకోనున్నారు. సీఎం సభకు హాజరయ్యే విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, విలేకర్లు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. సభలో 15 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇంగ్లిష్ ల్యాబ్, డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు, వైఎస్సార్ కిశోర వికాసంకు సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు..
సీఎం సభ ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్, అటవి, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురామ్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జేసీ షన్మోహన్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.
ఇంగ్లీష్ ల్యాబ్..
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ఇంగ్లీష్ మీడియంను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రానున్న విద్యా సంవత్సరంలో ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను అమలు చేయనున్నారు. ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని సులభంగా అర్ధం చేసుకుంటూ త్వరితగతిన దానిని అందుకునే విధంగా ఈ ల్యాబ్‌లు విద్యార్థులకు ఎంతగానో దోహదపడనున్నాయి. ఇందుకు సంబంధించి పది మంది విద్యార్థులతో పది ల్యాబ్‌ల డెమోను ఏర్పాటు చేశారు. దీంతోపాటు విద్యార్థుల కంటి చూపును దృష్టిలో ఉంచుకొని శ్రీకారం చుట్టిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగుకు సంబంధించిన స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ కిశోరి వికాసం
వైఎస్సార్ కిశోరి వికాసం కింద కిశోర బాలికలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించనున్న కార్యక్రమాలు తెలియజేసే విధంగా స్టాల్‌ను ఏర్పాటు చేశారు. బాలికలకు సంబంధించి పదిరకాల అంశాలపై వైఎస్‌ఆర్ కిశోరి వికాసం అమలు చేయనున్నారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలలపై వేధింపులు, రక్తహీనత, రుతుస్రవణ పరిశుభ్రత, సఖి ఉమెన్ హెల్ప్‌లైన్, సఖి వన్‌స్టాప్ సెంటర్లు, మహిళా మిత్ర మరియు సైబర్ మిత్ర, శానిటేషన్ అండ్ ప్లానిటేషన్, కెరీర్ గైడ్‌లైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాల అమలు తెలియజేసే విధంగా వైఎస్‌ఆర్ కిశోరి వికాసం బుక్‌లెట్‌ను సిద్ధం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా వైఎస్సార్ నవరత్నాలు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న వైఎస్సార్ నవరత్నాలు అందరికీ తెలిసే విధంగా ఉప్పుతో వేసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం ప్రసంగించే సభా వేదిక ముందు ఉప్పుతో వైఎస్సార్ నవరత్నాల్లోని ప్రతి పథకం తెలిసే విధంగా దానిని రూపొందించారు.
కళ్లకు కట్టేలా నాడు–నేడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మన బడి నాడు – నేడు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం పాఠశాల స్థితిగతులు, రెండేళ్ల తర్వాత వాటిలో ఎలాంటి మార్పు తీసుకురానున్నారో కళ్లకు కట్టే విధంగా సీఎం సభా ప్రాంగణంలో తరగతిని తలపించేలా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాల నేడు ఏవిధంగా ఉందో, రెండేళ్ల తర్వాత ఏవిధంగా ఉండబోతుందో తెలిపే విధంగా స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాఠశాల స్థితి గతులు కళ్లకు ఉట్టిపడేలా తరగతి గదిలో బ్లాక్ బోర్డు, తిరిగి తిరగనట్లుగా ఉండే ఒక ఫ్యాన్, విరిగిపోయిన బల్లలు, ఊడిపోయిన కిటికీ రెక్కలు, పడిపోయిన తలుపు రెక్కలు, నేలంతా పగిలిపోయి గుంటలు గుంటలుగా ఉండటం, టాయిలెట్ కూడా సరిగా లేకపోవడం వంటివి కళ్లకు కట్టినట్లుగా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెండేళ్ల తర్వాత ఆ పాఠశాల ఏవిధంగా ఉండబోతుందో కూడా కళ్లకు కట్టేలా చూపించారు. గ్రీన్ చాక్ బోర్డు, చక్కగా తిరుగుతుండే రెండు ఫ్యాన్లు, విద్యార్థులు కూర్చునేందుకు కార్పొరేట్ స్థాయిలో బల్లలు, నేలపై టైల్స్, శుద్ధి చేసిన తాగునీరు, ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్స్‌తో పాఠశాల స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
భద్రతే మన బాధ్యత
ఒంగోలు: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఒంగోలుకు వస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఏ1 ఫంక్షన్ హాల్లో సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తుకు నియమితులైన అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మనబడి నాడు–నేడు కార్యక్రమానికి మిక్కిలిగా విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్న దృష్ట్యా వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విధులను బాధ్యతగా నిర్వహిస్తే ఎస్పీ అయినా, హోంగార్డు అయినా ఒకటే అని గుర్తుంచుకోవాలన్నారు. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. 300 నుంచి 400 బస్సులు విద్యార్థులతో మీటింగ్ వద్దకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సభాప్రాంగణానికి అవతలి వైపు బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. సభ జరిగే ప్రాంతం నగరం నడి బొడ్డున ఉండటం, ఇరుకు ప్రదేశం కావడం వల్ల మన పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
బందోబస్తు విధులకు 1500 మంది
బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తోపాటు ఒక అదనపు ఎస్పీ, 11 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు/ఆర్‌ఐలు, 119 మంది ఎస్సైలు, ఏఎస్సై/హెడ్‌కానిస్టేబుల్ 671, హోంగార్డులు 301మంది, సాయుధ పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 1500 మందిని సీఎం పర్యటన బందోబస్తు డ్యూటీలకు కేటాయించారు.
ట్రాఫిక్ నిబంధనలు
సీఎం పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ డీఎస్పీ కె.వేణుగోపాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. ఉదయం 6 నుంచి సీఎం కార్యక్రమం ముగిసి సభకు వచ్చే వాహనాలు పూర్తిగా వెళ్లే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. అంజయ్య రోడ్డులోకి ఉదయం 6 గంటల నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రజలు కర్నూలు రోడ్డు వైపు, మంగమూరు రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డులో ముఖ్యమంత్రి కార్యక్రమానికి గంట ముందు మాత్రమే చీమకుర్తి వైపు నుంచి వచ్చే స్కూలు బస్సులను అనుమతిస్తారు. కందుకూరు నుంచి వచ్చే స్కూలు బస్సులు మంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయరుపేట రైతు బజారుమీదుగా రంగారాయుడు చెరువు జంక్షన్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పాఠశాల బస్సులకు ఆంధ్రకేసరి కాలేజీకి ఎదురుగా ఉన్న ప్రాంతంలో, కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. వీఐపీల పార్కింగ్ మాత్రం రంగారాయుడు చెరువుకు ఎదురుగా ఉన్న చాకలి కుంట వద్ద ఏర్పాటు చేశారు. కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో జనరల్ వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. బండ్లమిట్ట, అద్దంకి బస్టాండు వైపునుంచి వచ్చేవారు ఆర్టీసీ బస్టాండు వద్ద కేటాయించిన పార్కింగ్ ప్లేసులో వాహనాలను ఆపి సభా ప్రాంగణానికి వెళ్లాలన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని పీటీసీ హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రజలకు సూచనలు చేశారు.
నాడు–నేడు కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ పోల భాస్కర్
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సభ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ షన్మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 14వ తేది తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులతో పాటు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించామన్నారు. ప్రధాన వేదికతో పాటు గ్యాలరీలు, పైలాన్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, మున్సిపల్ ఇంజినీర్ డి.సుందరరామిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment