ఇదో ముడుపు కథ
పట్టిసీమలో రూ. 300 కోట్ల కోసం చంద్రబాబు పోలవరాన్ని పణంగా పెట్టారు
సీఎంపై వైఎస్ జగన్ ధ్వజం బస్సు యాత్రలో ప్రకాశం బ్యారేజీ, వెలిగొండ టన్నెల్ సందర్శన
► తమ కాంట్రాక్టర్లే అర్హత సాధించేలా టెండరు నిబంధనలు మార్చారు
► వారు 21.9 శాతం అధికంగా టెండర్లు వేసినా బాబు వంతపాడారు
► ఐదు శాతం అధికమని.. 16.9 శాతం బోనస్‌గా ఇస్తామని చెప్తున్నారు
► పట్టిసీమపై ఉన్న ప్రేమ వెలిగొండపై ఉంటే అది ఈ ఏడాది పూర్తయ్యేదే
► పట్టిసీమకు అవసరమయ్యే నిధులతో వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది
► రూ. 1,650 కోట్లు అవసరమైతే.. బడ్జెట్‌లో కేటాయించింది రూ. 150 కోట్లు
► రాయలసీమకు నీళ్లివ్వటానికే పట్టిసీమ అనే చంద్రబాబు మాట బూటకం
► సీమపై అంత ప్రేమ ఉంటే.. హంద్రీ - నీవా, గాలేరి - నగరి ప్రాజెక్టులను
► పూర్తిచేసేందుకు చర్యలేవీ? బడ్జెట్‌లో నిధుల కేటాయింపులేవీ?
► పోతిరెడ్డిపాడు కింద పనులు పూర్తిచేయడానికి నిధుల కేటాయింపులేవీ?
► అసలు పట్టిసీమ ప్రాజెక్టు జీవోలో రాయలసీమ ఊసు ఎక్కడ?
► అసలు ఆ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులూ చేయలేదు?
► అంటే ఇతర ప్రాజెక్టులకు కేటాయింపుల్లో కోత పెట్టటం ఖాయమే కదా!
► చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు కలిసి పోరాటం చేద్దాం
విజయవాడ/వెలిగొండ: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారని.. ఈ ప్రక్రియలో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు చేతులు మారాయని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును సైతం పణంగా పెడుతున్నారని.. రైతుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుది మోసపూరిత విధాన మని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టుపై మొదటి నుంచీ ఆయనది దొంగాటేనని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరందుతుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల బాటలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఇక్కడ నీటి నిల్వలకు సంబంధించిన సాంకేతిక అంశాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ మీద తన కోసం వచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాత్రి ప్రకాశం జిల్లాలో వెలిగొండ టన్నెల్‌ను సందర్శించారు. టన్నెల్ లోపలికి ట్రాలీలో వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సమీపంలో ఆ ప్రాంత రైతులతో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు.
ఉప్పొంగే జీవజలాలు.. ఉప్పుసముద్రం పాలు..
వర్షపు నీటినీ, వరద నీటినీ నిల్వ చేసుకునే సామర్థ్యం లేకనే ఉప్పొంగే జీవజలాలు సముద్రం పాలవుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఏటా 290 టీఎంసీల నీరు వృధాగా సాగరంలో కలసిపోతోందన్నారు. దీన్ని నివారించి నీటిని సమర్థంగా నిల్వ చేసుకునే దిశగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టారని వివరించారు. అది పూర్తయితే 194 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకోగలుగుతామన్నారు. అన్ని ప్రాంతాలను సశ్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్‌లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పులిచింతలకు చంద్రబాబు తొమ్మిదేళ్ళ తన హయాంలో కేవలం రూ. 24 కోట్లు మాత్రమే కేటాయించగా... తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దాని ప్రాధాన్యతను గుర్తించి తన హయాంలో 90 శాతం పూర్తిచేశారన్నారు. మిగిలిన పది శాతాన్ని పూర్తి చేసేందుకు రూ. 290 కోట్లు అవసరమవుతాయనీ, బాబు దానికి రూ. 20 కోట్లు మాత్రమే కేటాయించారంటే బాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. పులిచింతల పూర్తయితే 40 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం మన రాష్ట్రానికి లభిస్తుందన్నారు.
కమీషన్ల కోసమే పట్టిసీమపై బాబు పట్టు...
వాటిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు తెరమీదకు తెచ్చారని జగన్ ధ్వజమెత్తారు. దీని కోసం రైతాంగాన్నీ, రాష్ట్రాన్నీ హోల్‌సేల్‌గా అమ్మేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజె క్టు టెండర్ల నిబంధనలలో తమకు అత్యంత కావలసిన రెండు కాం ట్రాక్టు సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలను మార్చారని తూర్పారబట్టారు. అంచనా విలువ కంటే 21.9% ఎక్కువకు టెండరు కోట్ చేయడం, ఏడాదిలో ప్రాజెక్టులో పూర్తి చేస్తే 16.9 శాతాన్ని బోనస్‌గా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంలో 300 కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాల్వకు చుక్కనీరు మళ్లించకుండానే.. ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో మన వాటాను కోల్పోయేప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
పట్టిసీమపై ఉన్న ప్రేమ వెలిగొండపై లేదేమి?
‘‘పట్టిసీమ నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చవుతాయో అంతే మొత్తం వెలిగొండ పూర్తి కావడానికి అవసరమవుతాయి. కానీ చంద్రబాబు ఏ మాత్రం ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదు. వెలిగొండ పూర్తి కావడానికి ఇంకా రూ. 1,650 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్‌లో ఆయన కేటాయించింది కేవలం రూ. 150 కోట్లు మాత్రమే. ఇలా నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘వెలిగొండ నిర్మాణం పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు కూడా లభిస్తుంది. అలాంటి బృహత్తరమైన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ.. ఇంకా తనకు ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతారు’’ అని ఆయన విమర్శించారు. 1996లో ఎన్నికలొచ్చినపుడు అపుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇదే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని, ఎన్నికలయ్యాక దానిని మరచిపోయారని, మొత్తం ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వెలిగొండకు కేటాయించిన మొత్తం కేవలం రూ.13.5 కోట్లు మాత్రమేనని జగన్ తూర్పారబట్టారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3,000 కోట్లు కేటాయించారని, ఆయన చేసిన కేటాయింపుల వల్లనే ఇపుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయని జగన్ గుర్తుచేశారు.
సీమపై బాబు కపట ప్రేమ...
రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమ ఒలక బోస్తున్నారని.. రాయలసీమకు నీళ్లివ్వడానికే పట్టిసీమ అని ఓ వైపు చెబుతూ అక్కడికి నీళ్లు తీసుకువెళ్లే హంద్రీ - నీవా, గాలేరు - నగరి ప్రాజెక్టులకు అరకొర మొత్తాలను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని జగన్ ఎండగట్టారు. ‘‘రాయలసీమ మీద ప్రేమ ఒలగబోస్తున్న చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు హంద్రీ - నీవాకు కేటాయించింది రూ. 13 కోట్లే. దాని అంచనా వ్యయం రూ. 6,850 కోట్లు. బాబుకు సీమ మీద అంత ప్రేమ ఉంటే కనీస సంవత్సరానికి రూ. 2 కోట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవాకు రూ. 4,000 కోట్లు ఖర్చు చేశారు. పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టు ద్వారా కొంత మేర నీళ్లిస్తున్నారు. ఇప్పుడు బాబు వచ్చి హంద్రీ - నీవా కుళాయి తిప్పి ఆ ఘనత అంతా తనదే అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో రూ. 1,100 కోట్లు అవసరమైతే.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇచ్చింది రూ. 200 కోట్లే’’ అని ఎద్దేవా చేశారు. ‘‘గాలేరు - నగరి పరిస్థితి కూడా అంతే. అంచనా వ్యయం రూ. 7,200 కోట్లు అయితే బాబు ప్రభుత్వంలో 9 సంవత్సరాలకు గాను రూ. 17 కోట్లు కేటాయించారు. అంటే.. జీతభత్యాలకూ సరిపోని పరిస్థితి. వైఎస్ హయాంలో దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు బడ్జెట్‌లో బాబు చేసిన కేటాయింపులు రూ. 169 కోట్లే. ఇలా చేస్తూ పోతే.. గాలేరు నగరి ఎప్పుడు పూర్తయ్యేను?’’ అని నిలదీశారు.
బాబు చెప్పేవన్నీ అబద్ధాలే...
చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అని జగన్ విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేసేసినట్లుగా చెప్తున్నారని కానీ రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదనేది వాస్తవమని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల రుణాల విషయంలో కూడా అంతేజరిగిందన్నారు. రాయలసీమ విషయంలో కూడా అంతేనని పోతిరెడ్డిపాడు కింద ఉన్న పథకాలకు అరకొర నిధులు కేటాయించి అవి పూర్తికాకుండా ఎలా నీరిస్తారని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు రావాలంటే శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగు మేరకు నీటిమట్టం ఉండాలని, కానీ చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాదిలో ఆ మట్టం 803 అడుగులకు తగ్గిపోయిందని జగన్ విమర్శించారు. ‘‘ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలు నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడుతున్నామన్న సంగతి మనకన్నా ఎక్కువగా మరెవరికీ తెలియదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మన గోడు ఏమాత్రం వినిపించడం లేదు. ఆయనకు ఎంతసేపు కాంట్రాక్టర్లు, కమీషన్లు తప్ప మరేమీ కనిపించడం లేదు’’ అని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి గోదావరి డెల్టా రైతులను రక్షించడం, వెలుగొండ ప్రాజెక్టు సాధనకు పోరాటం చేయడం అవసరమన్నారు. ఇందుకోసం కలిసికట్టుగా ఉద్యమిద్దామని, రానున్న రోజుల్లో మరింత గట్టిగా ప్రభుత్వంపై పోరాటం చేద్దామని జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.
అవధుల్లేని అభిమానం
వెలుగొండ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అలుపెరగని అభిమానం గంటల కొద్దీ పరుగులు తీసింది. ‘అన్నా...జగనన్నా’ అంటూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వెంట అభిమానులు, కార్యకర్తలు కిలోమీటర్ల కొద్దీ ఉప్పొంగిన ఉత్సాహంతో వెన్నంటి నడిచారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి మొదలైన రెండో రోజు బస్సుయాత్ర రాత్రి 9 గంటల వరకు జనం మధ్యనే సాగింది. ఉదయం 10 గంటలకు పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడున్న ఈఈ రవికుమార్, మరో ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి, ఏడాదికి ఎంత నీరు సముద్రంలో కలుస్తున్నదీ ప్రశ్నించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు బయలుదేరారు. ఆయన కాన్వాయ్ కోటప్పకొండకు చేరగానే జోరున వర్షం మొదలైంది. పెట్టూరివారిపాలేం గ్రామానికి చెందిన మహిళలు జోరున కురిసే వర్షంలో తడుస్తూ నిలబడటం చూసి జగన్ వారిని పలకరించారు. కుంట, దోర్నాలల్లో 20 వేల మందికి పైగా రైతులు, అభిమానులు 3 గంటల పాటు రాజన్నబిడ్డ కోసం ఎదురు చూశారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర, జిల్లా నేతలు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, జంకే వెంకటరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
పట్టిసీమ జీవోలో సీమ పేరెక్కడ?
పట్టిసీమ నిర్మాణానికి జారీ అయిన జీవోలో కూడా ఎక్కడా రాయలసీమకు నీళ్లివ్వడానికే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు పేర్కొనలేదని జగన్ గుర్తుచేశారు. గోదావరి నుంచి కృష్ణా నదిలోకి నీటిని తెస్తే వాటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఎక్కడుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లతో తాను మాట్లాడినపుడు ఏడాదికి రెండు చోట్లా 60 నుంచి 80 రోజుల పాటు దాదాపు ఒకే సమయంలో వరదలు వస్తాయని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘‘అంటే దీనర్థం అక్కడి నీళ్లు ఇక్కడికి తెచ్చి సముద్రంలోకి వదలి వేయడమే కదా?’’ అని జగన్ ప్రశ్నించారు. పోలవరాన్ని పక్కనబెట్టి నిర్మించ తలపెట్టిన పట్టిసీమకు అయ్యే రూ. 1,300 కోట్లు నిధులు వెలిగొండకు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. పైగా పట్టిసీమకు బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదని, దీనర్థం రాబోయే రోజుల్లో ఇతర ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కోత వేయడమేనని పేర్కొన్నారు.