పులివెందులలో తన నివాసంలో జనాల మధ్యన వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి పులివెందులకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో కడపకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చేతులు జోడించి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.
రాత్రి 8గంటల ప్రాంతంలో ఆయన పులివెందులలోని స్వగృహానికి చేరుకున్నారు. అప్పటికే ఆయన కోసం వేచి ఉన్న పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు, ప్రజలను పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజాద్ బాష, కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డితోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
నేడు ఇఫ్తార్ విందులో పాల్గొననున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉదయం 8.30గంటల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటారని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు రసూల్ సాహేబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment