క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖ అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవినీతి ఉండకూడదని, అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతి గురించి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొన్నారని అధికారులు వివరించారు. ఎల్‌ఐసీ నుంచి బీమా చెల్లింపులు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. బీమా చెల్లింపుల కోసం ప్రధానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచడం, మందుల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సూచనలు, ఆదేశాలు
- మందుల కొనుగోలులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలి.
- ఈఎస్‌ఐ కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు ఉండాలి.
- ఈఎస్‌ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.
- వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే నిర్దేశించుకున్న ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి.
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం.
- ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్యను 11 నుంచి 27కు పెంచుతున్నాం.
- ఈ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారు.
- వీరి సేవలను కూడా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలి.
- వైద్య ఆరోగ్య శాఖతో అనుసంధానమైన ఈఎస్‌ఐ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.
- కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి.
- ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఏమైనా సేవలు మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు పంపితే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
- కాలుష్య నివారణపైనా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలి.
- కాలుష్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలుష్య నివారణ ప్రమాణాలు ప్రదర్శించాలి.
- సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేయడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీంతో భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయి. దీన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment