
నగరి అదిరింది
- 6వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రకు విశేష స్పందన
- జననేతను చూసేందుకు గ్రామగ్రామాన బారులు తీరిన జనం
- నగరి నియోజకవర్గంలో కిక్కిరిసిన రోడ్ షోలు
- ఆగిన ప్రతిచోటా వృద్ధులకు పింఛన్ పంపిణీపై జగన్ ఆరా
- దేశూరు క్రాస్‌లో మహానేత విగ్రహావిష్కరణ
- దేశమ్మగుడిలో వై.ఎస్.జగన్ ప్రత్యేక పూజలు
- ఆరూరులో వడివేలు కుటుంబానికి ఓదార్పు
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి నగరి నియోజకవర్గంలో జనం అపూర్వ స్వాగతం పలికారు. జననేతను చూసేందుకు గ్రామగ్రామాన జనం బారులు తీరారు. ప్రతి ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచి రోజులు త్వరలోనే ఉన్నాయంటూ ధైర్యం చెప్పారు.
న్యూస్‌లైన్, నగరి: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య, ఓదార్పుయాత్ర ఆరోరోజు శనివారం నగరి నియోజకవర్గంలో సాగింది. నగరిలో శుక్రవారం రాత్రి బస చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ కె.జె.కుమార్ ఇంటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రోడ్ షోకు శనివారం ఉదయం బయలుదేరారు. మొదట నగరి బైపాస్‌రోడ్డులో ప్రారంభంలో ఉన్న హిమజా విద్యాసంస్థల విద్యార్థులు, మహిళా అధ్యాపకులు అందరూ వై.ఎస్.జగన్ కాన్వాయ్‌ను ఆపి ఘనస్వాగతం పలికారు. ఇక్కడ కొంతసేపు జగన్ జనంతో ముచ్చటిం చారు.
అనంతరం పట్టణంలోని నగరి ఎస్సీ కాలనీ చేరుకున్నారు. ఇక్కడ దాదాపు 50 మంది రామ్మూర్తి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో జగన్ సమక్షంలో చేరారు. ఈ కాలనీలోని దళిత యువకులు జగన్‌ను కలిసేందుకు పోటీపడ్డారు. దళిత యువకులు సమైక్యాం ధ్ర మ్యాప్‌తో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ జెండాలను రూపొందించారు. అభివాదం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మలతో కూడిన ఈ జెండాలను కాన్వాయ్ వద్ద పైకి ఎత్తిపట్టుకుని ప్రదర్శించారు. సమైక్య సింహం వై.ఎస్.జగన్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దేశమ్మగుడిలో పూజలు
నగరి ఎస్సీ కాలనీ నుంచి దేశమ్మగుడికి చేరుకున్న జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నుంచి బయటకు రాగానే యువకులు జగన్‌ను కలిసేందుకు పోటీపడ్డారు. దేశమ్మగుడి నుంచి ముందుకు రాగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి వచ్చిన వందమంది పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుసుకున్నారు. జగన్ రోడ్‌షో నిర్వహిస్తున్న మార్గంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత ఆర్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. ఎం.కొత్తూరులో వై.ఎస్.జగన్ రోడ్‌షోకు మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
గ్రామం లో నాలుగు చోట్ల మహిళలు బృందాలుగా జగన్ కాన్వాయ్‌ను ఆపి స్వాగతం పలికారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించిన అనంతరం ఆయన ముందుకు కదిలారు. ఎం.కొత్తూరు ఎస్సీకాలనీలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున జగన్‌ను ఆహ్వానించారు. వేలవాడి గ్రామంలో రోడ్‌షోను చూసేందుకు ముస్లిం మహిళలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ఈ గ్రామంలో అర్ధ గంటకుపైగా జగన్ ఉన్నారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మైనారిటీ మహిళలను పలకరించారు. వేలవాడిలో పార్టీ నాయకులు ఏర్పా టుచేసిన వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించారు.
ఇక్కడా జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. చిన్నపిల్లలను పలువురు తమ భుజాలపై కూర్చోపెట్టుకుని జగన్‌ను చూపేందు కు ప్రయత్నించారు. బుగ్గ అగ్రహారం లో జగన్ రోడ్‌షోతో గ్రామం జనసంద్రంగా మారింది. డప్పులు వాయి స్తూ, నృత్యాలు చేస్తూ యువకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. తనను కలుసుకున్న వృద్ధులతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అవ్వా పిం ఛన్ అందుతోందా అని ఆప్యాయంగా వాకబు చేశారు. నాలుగు నెలల్లో ఎన్నికలు అయి ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తానని మహిళా రైతు కూలీలకు భరోసా ఇచ్చారు.
జననేతను చూడాలని..
నిండ్ర మండలం ఇరవాయి కాలనీ రైతులు, ప్రజలు జగన్‌ను చూసేందుకు కిలోమీటరు దూరం నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చారు. రైతుల కష్టాలు తీరాలన్నా, కరెంట్ చార్జీలు తగ్గాలన్నా వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావాలని గ్రామస్తులు ఏర్పాటు చేసిన కటౌట్ అందరినీ ఆకర్షించింది. బుగ్గ అగ్రహారం ప్రారంభంలో ఒ.నాగమ్మ, ఒ.దుర్గాబాయమ్మ అనే నడవలేని వృద్ధురాళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టారు. జననేత కాన్వాయ్ దిగి వారి వద్దకు వచ్చి వృద్ధురాళ్లతో మాట్లాడారు. వారి ఆరోగ్యం ఎలా ఉందని, పింఛన్ వస్తోందా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.