ప్రాజెక్టులకు పెద్దపీట | YS Jagan mohan reddy Samiyakashkaram Yataya | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు పెద్దపీట

Published Tue, Jan 7 2014 3:11 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ప్రాజెక్టులకు పెద్దపీట - Sakshi

ప్రాజెక్టులకు పెద్దపీట

=జిల్లాలో నీటి పరిస్థితి దారుణం
=చేనేత కార్మికులను ఆదుకుంది వైఎస్ ఒక్కరే
=మదనపల్లెలో జగన్ ప్రసంగానికి జేజేలు

 
సాక్షి, తిరుపతి: రాష్ర్టంలో నీటి పరిస్థితి చాలా దారుణం గా ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో మూడో విడత చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా రెండో రోజైన సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బయలుదేరిన జననేత మదనపల్లెకు చేరుకున్నారు. అక్కడ నీరుగ ట్టువారిపల్లె వద్ద వేచి ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రంలో నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పరిస్థితి తలచుకుని ప్రతి రైతు ఆందోళనలో ఉన్నాడని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అదే విధంగా  చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదని అన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు 30 వేల మంది చేనేత కార్మికులకు 320 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు.

అటువంటి చర్యలు తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మాటలకు ప్రజలు ‘‘జైజగన్’’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల వంద రోజులు పనిచేసినా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేశారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆయన పథకాలను అమలు చేశారని తెలిపారు. పేదవారి గుండెచప్పుడు వినేవాడే అసలైన రాజకీయ నాయకుడని దివంగత ప్రియతమ నేత అన్నారని తెలిపారు. కానీ నేటి రాజకీయ నాయకులు దిక్కుమాలిన ఆలోచనలతో పాలన సాగిస్తున్నారనగానే, ‘‘అవును’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

నేటి రాజకీయనాయకులు చేనేత కార్మికుల గురించి కానీ, రైతుల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం లేదన్నారు. అందుకే అందరూ కలసి ఒక తాటిపైకి వచ్చి, రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలిపారు. సోనియా గీసిన గీత దాటని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి మదనపల్లికి వస్తే ఇక్కడి వారు కాలర్ పట్టుకుని అడగాలని అన్నారు.

శాసనసభ జరుగుతోందని అందులో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యమంటూ, తెలంగాణా ఎమ్మెల్యేలతో విభజనకు సానుకూలత తెలుపుతూ నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని అనగానే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోతున్నాయని గుర్తు చేశారు. మన నీటికోసం మనం తన్నుకుని చావాలా అని అడిగితే, ప్రజలు ‘నో’ అని సమాధానం చెప్పారు.

ఢిల్లీ మనసులు మారేలా గట్టిగా అరిచి రెండు చేతులెత్తి చెప్పాలని ఆయన కోరగానే పెద్దగా నినాదాలు చేశారు. జైసమైక్యాంధ్ర అనమనగానే గట్టిగా అరవడంతో, మీ నినాదాలతో ఢిల్లీకి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నానన్నారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఏఎస్.మనోహర్, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, నాయకులు రంగారెడ్డి, అక్తర్ అహ్మద్, బాబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement