Samiakya sankharavam
-
ఉవ్వెత్తున ఉత్సాహం
జగన్ రాకతో పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు సభల ఘన విజయంతో ఎన్నికల ముందు ఊపు ఉప్పొంగిన జన సంద్రాన్ని చూసి సాగరం చిన్నబోయింది. ఉవ్వెత్తున వీచిన అభిమాన పవనాన్ని గమనించి గాలి కెరటం కదలడానికి సైతం సంకోచించింది. జననేత పట్ల వ్యక్తమైన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తిలకించి ఆకాశం అబ్బురపడింది. ప్రజల కోసం నిలబడి, అన్యాయాలపై కలబడే నాయకుడు మళ్లీ వచ్చిన ఆనందంతో అవని పులకించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాకు తరలిరాగా ఆయన మాట వినడానికి, కనులారా చూడడానికి ప్రతి అభిమాని హృదయం ఆత్రుత పడింది. సమైక్య శంఖారావం పూరించిన ప్రజాభిమాన రథ సారథికి లభించిన ఆత్మీయ స్పందన చూసి కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర సమరంలో అలుపెరుగని పోరు కొనసాగిస్తున్న జనహదృయాధినేత జగన్మోహన్ రెడ్డిపై జిల్లాలో అభిమానం పూల వెల్లువలా కురిసింది. రాష్ట్ర విభజనను అన్ని విధాలా వ్యతిరేకించాలన్న దీక్షతో సమైక్య శంఖారావం పూరించిన జగన్‌కు అపురూప స్వాగతం లభించింది. ఆయన పాల్గొన్న రెండు సభల్లో వ్యక్తమైన అభిమానం అందరినీ ముగ్థులను చేసింది. రెండు చోట్లా సభ లు ఆలస్యమైనా ఇసుక వేస్తే రాలని రీతిలో ఉరకలేసిన జన సందోహాన్ని చూసి పార్టీ కార్యకర్తల్లో సంతోషం ఉరకలేసింది. మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆర్భాటాలు లేకుండా వచ్చిన ఆత్మీయ నాయకుడి పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ ‘ఔరా’ అనిపిస్తోంది. ఎన్నికలు చేరువవుతున్న వేళ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి విపక్షాలు అతలాకుతలమవుతున్నాయి. ఏ క్షణంలో ఎవరు తమ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి చేరతారోనన్న భయాందోళనల్లో ఉన్నారు. దీనికి తోడు, జగన్ రాక గంటల తరబడి ఆలస్యమైనా, వేలాది మంది ప్రజలు ఓపిగ్గా నిరీక్షించడాన్ని చూసి విపక్షాలు విస్తుపోతున్నాయి. రెండేళ్ల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనపై కురుస్తున్న ఆత్మీయాభిమానాల జల్లును తిలకించి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 2012 ఏప్రిల్ 19, 20 తేదీల్లో చివరిసారి జగన్ జిల్లాకు వచ్చారు. గంగపుత్రుల బెంగ తీరుస్తానంటూ.. భరోసా ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని ధీరునిమాటపై విశ్వాసం ఉంచిన ‘పేట’ ప్రజలు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు పట్టం కట్టారు. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇదే ఆయన రాక. అయితే జనాదరణలో మార్పు లేదు.. ప్రజలంతా తమ భవిష్యత్ ఆశాజ్యోతి జగనేనని విశ్వసిస్తున్నారు. దానికి చోడవరం, గాజువాకలో నిర్వహించిన సమైక్య శంఖారావానికి వచ్చిన అశేష జనావళి స్పందనే సాక్ష్యం. గతంలోకంటే ఈసారి యువతరంలో ఉత్సాహం ఉరకలెత్తడం విశేషం. అందరి చూపూ.. వైఎస్సార్ సీపీ వైపు ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా నాయకులు చాలా వరకు వైఎస్సార్ సీపీలో చేరారు. తప్పని పరిస్థితుల్లో నేతలూ అదే దారిపడుతున్నారు. ఇన్నాళ్లూ తమను నమ్ముకున్న కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాహాటంగానే చెప్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా జగన్ బాట విపక్ష నేతలకూ శిరోధార్యమైంది. ఇదే మాటల్ని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ మీడియాకు చెప్తూ.. కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మరోవైపు తెలుగుదేశం నేతలు కూడా జగన్ సమక్షంలో పార్టీలోకి చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా పరిణామాలపట్ల పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుని ప్రజలు నమ్మరు
చోడవరం, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ సీపీ నాయకుల ప్రసంగాలు జనాన్ని ఆలోచింపజేశాయి. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల విధానాలను నాయకులు ఈ సందర్భంగా ఎండగట్టారు. చోడవరం సభలో పార్టీనేత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హామీలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి వలనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణాలు మాఫీ చేయాలని శాసనసభ్యులందరూ అడిగితే అది జరిగే పని కాదన్నారన్న విషయం ఆయన గుర్తుచేశారు. బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ వైఎస్ పథకాలను ప్రతి పేదవాడు పొందాడని, అందుకే ఆయన రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చెంగల వెంకటరావు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జనం పడరాని కష్టాలు పడ్డారని, మూలన వృద్ధురాలికి కూడా అప్పట్లో పింఛన్ ఇవ్వలేదని, కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడక్కుండానే అర్హులైన అందరికీ పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చారన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ జనం కష్టాలు తీరాలంటే రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిలో చోడవరం నియోజకవర్గ ఎంతో వెనుకబడి ఉందని, అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని, చోడవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పీలా ఉమారాణి మాట్లాడుతూ మహిళల కష్టాలు తీరాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. చోడవరం కో సమన్వయకర్త, బలిరెడ్డి సత్యారావు కుమార్తె కోట్ని నాగమణి మొదటిసారిగా వేదికపై ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. జగనన్నకు ప్రజలంతా అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కొయ్య ప్రసాద్‌రెడ్డి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, పూడి మంగపతిరావు ప్రసంగించారు. -
రేపట్నుంచి విశాఖలో జగన్ సమైక్య శంఖారావం
విశాఖపట్నం: సమైక్యశంఖారావం యాత్రలో భాగంగా ఈ నెల 8 వతేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొనే జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం వెళ్లి మధ్యాహ్నాం 3 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారని ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్ రాత్రి జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరౌతారు. -
సమైక్య శంఖారావం రేపు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో.. సాయంత్రం 5కు గాజువాకలో సభలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన చోడవరంలో జరిగే సభలో ప్రసంగిస్తారని పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు చొక్కాకుల వెంకట్రావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తెలిపారు. అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. శనివారం రాత్రి విశాఖలోనే బస చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సభలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు కోరారు. -
ప్రాజెక్టులకు పెద్దపీట
=జిల్లాలో నీటి పరిస్థితి దారుణం =చేనేత కార్మికులను ఆదుకుంది వైఎస్ ఒక్కరే =మదనపల్లెలో జగన్ ప్రసంగానికి జేజేలు సాక్షి, తిరుపతి: రాష్ర్టంలో నీటి పరిస్థితి చాలా దారుణం గా ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో మూడో విడత చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా రెండో రోజైన సోమవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బయలుదేరిన జననేత మదనపల్లెకు చేరుకున్నారు. అక్కడ నీరుగ ట్టువారిపల్లె వద్ద వేచి ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పరిస్థితి తలచుకుని ప్రతి రైతు ఆందోళనలో ఉన్నాడని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అదే విధంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదని అన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు 30 వేల మంది చేనేత కార్మికులకు 320 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. అటువంటి చర్యలు తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి మాటలకు ప్రజలు ‘‘జైజగన్’’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల వంద రోజులు పనిచేసినా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేశారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆయన పథకాలను అమలు చేశారని తెలిపారు. పేదవారి గుండెచప్పుడు వినేవాడే అసలైన రాజకీయ నాయకుడని దివంగత ప్రియతమ నేత అన్నారని తెలిపారు. కానీ నేటి రాజకీయ నాయకులు దిక్కుమాలిన ఆలోచనలతో పాలన సాగిస్తున్నారనగానే, ‘‘అవును’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. నేటి రాజకీయనాయకులు చేనేత కార్మికుల గురించి కానీ, రైతుల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం లేదన్నారు. అందుకే అందరూ కలసి ఒక తాటిపైకి వచ్చి, రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలిపారు. సోనియా గీసిన గీత దాటని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి మదనపల్లికి వస్తే ఇక్కడి వారు కాలర్ పట్టుకుని అడగాలని అన్నారు. శాసనసభ జరుగుతోందని అందులో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యమంటూ, తెలంగాణా ఎమ్మెల్యేలతో విభజనకు సానుకూలత తెలుపుతూ నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని అనగానే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోతున్నాయని గుర్తు చేశారు. మన నీటికోసం మనం తన్నుకుని చావాలా అని అడిగితే, ప్రజలు ‘నో’ అని సమాధానం చెప్పారు. ఢిల్లీ మనసులు మారేలా గట్టిగా అరిచి రెండు చేతులెత్తి చెప్పాలని ఆయన కోరగానే పెద్దగా నినాదాలు చేశారు. జైసమైక్యాంధ్ర అనమనగానే గట్టిగా అరవడంతో, మీ నినాదాలతో ఢిల్లీకి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నానన్నారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఏఎస్.మనోహర్, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, నాయకులు రంగారెడ్డి, అక్తర్ అహ్మద్, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్)
జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలులో, గుంటూరు వేదికగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షలు చేపట్టి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. విజయమ్మ తొలుత విజయవాడలో దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, అవనిగడ్డ ఉప ఎన్నికల కోడ్ కారణంగా గుంటూరులో నిర్వహించారు. షర్మిల జిల్లాలోని అవనిగడ్డ నుంచి కైకలూరు వరకు సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించి అందరిలో ఉద్యమ స్ఫూర్తి తెచ్చారు. అలాగే, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు, ఆందోళన నిర్వహించాయి. ఎంవీఎస్ నాగిరెడ్డి, యెర్నేని నాగేంద్రనాథ్ వంటి నేతలు రైతులను సైతం ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. విజయవాడలో యూఎస్‌వో నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం సాగింది. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితర నేతలు జనంలోకి వెళ్లలేకపోయారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు నాల్కల ధోరణి అవలంబించలేక సతమతమయ్యారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సమన్యాయం అంటూ జిల్లాలో బస్సు యాత్రకు వచ్చారు. ప్రజా స్పందన లేకపోవడంతో అర్థంతరంగా నిలిపివేశారు. పోరాట ఖిల్లా.. కృష్ణాజిల్లా.. నిరంతరం సమైక్యత కోసం పాటుపడిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో కేంద్రంలోని యూపీఏ సర్కారు 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. అనంతరం రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగిరం చేస్తూ గత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో సమైక్య రాష్ట్రం కోసం మళ్లీ పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఉద్యోగులు 66 రోజులు సమ్మెబాట పట్టగా, ప్రజలు మాత్రం 150రోజులకుపైగా ఉద్యమ బావుటా ఎగురవేశారు. ఏపీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు కదం తొక్కాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె మొదలైంది. సుమారు 35వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. జిల్లా అంతటా ఉద్యమం రాష్ట్రస్థాయిలో సమైక్య ఉద్యమానికి ఊపిరిలూదిన పరుచూరి అశోక్‌బాబు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందినవాడు కావడం విశేషం. విజయవాడ, హనుమాన్ జంక్షన్, గుడివాడ, ఉయ్యూరుల్లో జరిగిన సమైక్య గర్జన సభలకు అశోక్‌బాబు, మిగిలిన రాష్ట్ర నాయకులు హాజరై ఉత్తేజపరిచే ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. బందరులో సెప్టెంబర్ 19న నిర్వహించిన గర్జనలో ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొని జిల్లా గొప్పతనాన్ని వివరించారు. రాష్ట్రస్థాయి సమైక్య పోరులో ఒక వెలుగు వెలిగిన వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మన జిల్లా ఆడపడుచే కావడం విశేషం. అలాగే, మనజిల్లాకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జీతాల్లేవ్.. జిల్లాలోని ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు సంక్షోభాన్నే మిగిల్చింది. ట్రెజరీల్లో పనిచేస్తున్న సుమారు 175మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. మచిలీపట్నం ట్రెజరీ ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని 18 సబ్ ట్రెజరీ కార్యాయాల్లో కార్యాకలపాలు స్తంభించారుు. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పలు అభివృద్ధి పనులకు విఘాతం ఏర్పడింది. ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు జిల్లాలో ఆగస్టు 22 నుంచి విద్యాసంస్థలు బంద్ పాటించారుు. 3,340 సర్కారీ బడుల్లో పనిచేస్తున్న సుమారు 16వేల మంది ఉపాధ్యాయుల్లో చాలామంది విధులు బహిష్కరించారు. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యా సంవత్సారాన్ని నష్టపోయారు. 16 శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఆగస్టు 28 నుంచి సమ్మెబాట పట్టడంతో పాలన పడకేసింది. జిల్లాలోని మండల లెవెల్ స్టాక్‌పాయింట్ పాయింట్ల నిర్వాహకులు సైతం సమ్మెబాట పట్టడంతో అమ్మహస్తం, కిరోసిన్ వంటి సరుకుల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లూ ఆలస్యంగానే పంపిణీ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఆక్వా రంగాలతో పాటు ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమయ్యారు. ప్రజావాణి జరగకపోవడంతో ప్రజల మొరవినే వారు కరువయ్యారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖకు సమ్మె సెగ తగిలింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్ఎంలు, ప్రభుత్వ వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సుమారు మూడువేల మంది వరకు సమ్మెబాట పట్టారు. బిగిసిన పిడికిళ్లు.. = జిల్లాలో ఈ ఏడాది సమైక్య పోరు ఒక మైలురాయి కాగా, ఏడాది కాలంలో మరిన్ని ఉద్యమాలు సాగాయి. జిల్లాలో రైతులకు సకాలంలో సాగు నీరివ్వాలని, కరెంట్ సరఫరా సక్రమంగా సాగాలని, మద్దతు ధర ఇవ్వాలని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. =పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. =అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21 సమ్మె చేశారు. జూలై 10న, డిసెంబర్‌లోనూ నల్లచీరలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. =మునిసిపల్ వర్కర్ల సమస్యలపై విజయవాడ కార్పొరేషన్‌తోపాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మునిసిపాలిటీల్లో ఉద్యమం చేపట్టారు. =అర్హులైన పేదలకు భూములు పంచాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. =పెనుగంచిప్రోలు మండలం కొణకంచిలో సారా నిషేధించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. =తిరుపతమ్మ ఆలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరించారు. =బందరు పోర్టు సాధనకు 358 రోజులుగా దీక్షలు కొసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ మెరుపు సమ్మెతో కలవరం సమైక్య నినాదంతో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన మెరుపు సమ్మెతో ప్రభుత్వం కలవరపడింది. అయితే, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వారు మూడు రోజుల తరువాత విరమించారు. జిల్లాలోని ట్రాన్స్‌కో ఉద్యోగులు సుమారు 3వేల మంది, జెన్కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులు సమ్మె చేశారు. -
జననేత జగన్‌కే సాధ్యం
సమైక్య శంఖారావంలో వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర సమైక్యత కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ గన్నవరం, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఉప్పులేటి కల్పన, సింహద్రి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం సభ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి వారు మాట్లాడుతూ....రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాగల సత్తా, సామర్థ్యం కేవలం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ జాతీయస్థాయిలో పెద్దఎత్తున పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతంతో కళ్లబోల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యంధ్రా ముసుగులో విభజనకు సహాకరిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఉసరవల్లిలా రంగులు మారుస్తూ విభజనపై స్పష్టమైన ప్రకటన చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. శాసనసభలో టి-బిల్లుపై చర్చకు దూరంగా ఉంటూ ఇరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతూ బాబు చేస్తున్న కుటీల రాజకీయాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. రానున్న కాలంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ముందుకు నడిపించే శక్తి జగన్‌కు మాత్రమే ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు. పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గొసుల శివభరత్‌రెడ్డి, కాసర్నేని గోపాలరావు, కోటగిరి వరప్రసాదరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, తోట వెంకయ్య, ఆరుమాళ్ళ సాంబిరెడ్డి, ఎండీ. గౌసాని, కందిమాళ్ళ శ్రీనివాసరావు, కొల్లి రాజశేఖర్, మేచినేని బాబు, వింతా శంకరరెడ్డి, సూరం విజయకుమార్, సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు చిమటా శ్రీనివాసరావు, నెరుసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం
=వైఎస్సార్ సీపీ రైతునేత నాగిరెడ్డి =కంకిపాడులో ‘సమైక్య శంఖారావం’ కంకిపాడు, న్యూస్‌లైన్ : పాలక, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు.. కుమ్మక్కులు చేసినా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి చెప్పారు. ఆ పార్టీ మహిళావిభాగం జిల్లా కన్వీనర్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కంకిపాడు లాకు రోడ్డు సెంటర్లో సమైక్య శంఖారావం సభ జరిగింది. పార్టీ కంకిపాడు మండల కన్వీనర్ మాదు వసంతరావు అధ్యక్షతన జరిగిన సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. సోనియా రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. విభజనతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుందన్నారు. తమ పార్టీ మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథాన సాగాలని కోరుకుంటోందని తెలిపారు. రాష్ట్రం విడిపోతే సాగునీటి యుద్ధాలు జరిగి రైతు ఆత్మహత్యలు పునరావృతమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ముప్పును గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మల నేతృత్వంలో పార్టీ పోరాటాలను ఉధృతం చేసిందని పేర్కొన్నారు. నూజి వీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేయకపోవడం దారుణమన్నారు. బీజేపీతో కలిస్తే అధికారం వస్తుందని, కేసుల బాధ ఉండదని చంద్రబాబు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్ మాట్లాడుతూ.. నాలుగు నెలల పదవి కోసం నేతలు నానా పాట్లు పడుతున్నారన్నారు. తాతి నేని పద్మావతి మాట్లాడుతూ.. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో తిప్పికొడతామని ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుల వైఖరి విడ్డూరంగా ఉందని, సభలో కనీసం కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యమని స్పష్టంచేశారు. బీసీ విభాగం జిల్లా కన్వీనర్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మాట్లాడుతూ.. తాము ఓట్లు, సీట్లకోసం పోరాటం చేయడం లేదని, రాష్ట్ర ప్రజల బంగారు భవిత కోసమే చేస్తున్నామని వివరించారు. వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరారు. తొలుత ఆర్యవైశ్య ప్రార్థనామందిరంలో పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా లాకు రోడ్డు సెంటర్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు సింహా ద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), బండ్రపల్లి వల్లభాయ్ (తిరువూరు), జిల్లా నేత టీకేఆర్, పెనమలూరు, ఉయ్యూరు మండలాల కన్వీనర్లు కాకర్ల వెంకటరత్నం, వంగవీటి శ్రీనివాసప్రసాద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.రమేష్‌కుమార్, సూరపనేని రామారావు, కోటిరెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు సంగెపు శ్రీనివాసరావు, కలపాల వజ్రాలు, జి.రాజశేఖర్, వంగా శివార్జునరెడ్డి, మేదండ్రావు కుటుంబరావు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల మాజీ సర్పంచులు కొండా రామిరెడ్డి, గుంటక నాగిరెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ
-
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ సీపీ నేత రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం చేశారు. 'జబ్ సీధీ ఉంగ్లీ సే ఘీ నహీ నికలీతో ఉంగ్లీ టేఢీ కర్నీ పడేగీ' (వేలు తిన్నగా ఉంచితే డబ్బాలోంచి నెయ్యి రాదు.. వేలు వంకరగా పెట్టాల్సిందే) అంటూ సమైక్యరాష్ట్రం కోసం ఏమైనా చేస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో రెహ్మాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య శంఖారావం కోసం వస్తున్నవందలాది బస్సులను తెలంగాణ ప్రాంతాలలో నిలిపేశారని, పోలీసులు ఆ బస్సులను తక్షణమే అనుమతించాలని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావుకు రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు.