
చంద్రబాబుని ప్రజలు నమ్మరు
చోడవరం, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ సీపీ నాయకుల ప్రసంగాలు జనాన్ని ఆలోచింపజేశాయి. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల విధానాలను నాయకులు ఈ సందర్భంగా ఎండగట్టారు. చోడవరం సభలో పార్టీనేత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హామీలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి వలనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణాలు మాఫీ చేయాలని శాసనసభ్యులందరూ అడిగితే అది జరిగే పని కాదన్నారన్న విషయం ఆయన గుర్తుచేశారు. బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ వైఎస్ పథకాలను ప్రతి పేదవాడు పొందాడని, అందుకే ఆయన రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చెంగల వెంకటరావు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జనం పడరాని కష్టాలు పడ్డారని, మూలన వృద్ధురాలికి కూడా అప్పట్లో పింఛన్ ఇవ్వలేదని, కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడక్కుండానే అర్హులైన అందరికీ పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చారన్నారు.
కుంభా రవిబాబు మాట్లాడుతూ జనం కష్టాలు తీరాలంటే రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిలో చోడవరం నియోజకవర్గ ఎంతో వెనుకబడి ఉందని, అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని, చోడవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
పీలా ఉమారాణి మాట్లాడుతూ మహిళల కష్టాలు తీరాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. చోడవరం కో సమన్వయకర్త, బలిరెడ్డి సత్యారావు కుమార్తె కోట్ని నాగమణి మొదటిసారిగా వేదికపై ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. జగనన్నకు ప్రజలంతా అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కొయ్య ప్రసాద్‌రెడ్డి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, పూడి మంగపతిరావు ప్రసంగించారు.