
ఉవ్వెత్తున ఉత్సాహం
- జగన్ రాకతో పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు
- సభల ఘన విజయంతో ఎన్నికల ముందు ఊపు
ఉప్పొంగిన జన సంద్రాన్ని చూసి సాగరం చిన్నబోయింది. ఉవ్వెత్తున వీచిన అభిమాన పవనాన్ని గమనించి గాలి కెరటం కదలడానికి సైతం సంకోచించింది. జననేత పట్ల వ్యక్తమైన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తిలకించి ఆకాశం అబ్బురపడింది. ప్రజల కోసం నిలబడి, అన్యాయాలపై కలబడే నాయకుడు మళ్లీ వచ్చిన ఆనందంతో అవని పులకించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డి జిల్లాకు తరలిరాగా ఆయన మాట వినడానికి, కనులారా చూడడానికి ప్రతి అభిమాని హృదయం ఆత్రుత పడింది. సమైక్య శంఖారావం పూరించిన ప్రజాభిమాన రథ సారథికి లభించిన ఆత్మీయ స్పందన చూసి కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర సమరంలో అలుపెరుగని పోరు కొనసాగిస్తున్న జనహదృయాధినేత జగన్‌మోహన్ రెడ్డిపై జిల్లాలో అభిమానం పూల వెల్లువలా కురిసింది. రాష్ట్ర విభజనను అన్ని విధాలా వ్యతిరేకించాలన్న దీక్షతో సమైక్య శంఖారావం పూరించిన జగన్‌కు అపురూప స్వాగతం లభించింది. ఆయన పాల్గొన్న రెండు సభల్లో వ్యక్తమైన అభిమానం అందరినీ ముగ్థులను చేసింది. రెండు చోట్లా సభ లు ఆలస్యమైనా ఇసుక వేస్తే రాలని రీతిలో ఉరకలేసిన జన సందోహాన్ని చూసి పార్టీ కార్యకర్తల్లో సంతోషం ఉరకలేసింది. మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆర్భాటాలు లేకుండా వచ్చిన ఆత్మీయ నాయకుడి పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ ‘ఔరా’ అనిపిస్తోంది.
ఎన్నికలు చేరువవుతున్న వేళ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి విపక్షాలు అతలాకుతలమవుతున్నాయి. ఏ క్షణంలో ఎవరు తమ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి చేరతారోనన్న భయాందోళనల్లో ఉన్నారు. దీనికి తోడు, జగన్ రాక గంటల తరబడి ఆలస్యమైనా, వేలాది మంది ప్రజలు ఓపిగ్గా నిరీక్షించడాన్ని చూసి విపక్షాలు విస్తుపోతున్నాయి. రెండేళ్ల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనపై కురుస్తున్న ఆత్మీయాభిమానాల జల్లును తిలకించి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
రెండేళ్ల విరామం తర్వాత
పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 2012 ఏప్రిల్ 19, 20 తేదీల్లో చివరిసారి జగన్ జిల్లాకు వచ్చారు. గంగపుత్రుల బెంగ తీరుస్తానంటూ.. భరోసా ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని ధీరునిమాటపై విశ్వాసం ఉంచిన ‘పేట’ ప్రజలు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు పట్టం కట్టారు. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇదే ఆయన రాక. అయితే జనాదరణలో మార్పు లేదు.. ప్రజలంతా తమ భవిష్యత్ ఆశాజ్యోతి జగనేనని విశ్వసిస్తున్నారు. దానికి చోడవరం, గాజువాకలో నిర్వహించిన సమైక్య శంఖారావానికి వచ్చిన అశేష జనావళి స్పందనే సాక్ష్యం. గతంలోకంటే ఈసారి యువతరంలో ఉత్సాహం ఉరకలెత్తడం విశేషం.
అందరి చూపూ.. వైఎస్సార్ సీపీ వైపు
ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా నాయకులు చాలా వరకు వైఎస్సార్ సీపీలో చేరారు. తప్పని పరిస్థితుల్లో నేతలూ అదే దారిపడుతున్నారు. ఇన్నాళ్లూ తమను నమ్ముకున్న కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాహాటంగానే చెప్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా జగన్ బాట విపక్ష నేతలకూ శిరోధార్యమైంది. ఇదే మాటల్ని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ మీడియాకు చెప్తూ.. కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మరోవైపు తెలుగుదేశం నేతలు కూడా జగన్ సమక్షంలో పార్టీలోకి చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా పరిణామాలపట్ల పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.