సమైక్య శంఖారావానికి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు బయల్దేరారు. శనివారం ఉదయం ఆయన లోటస్ పాండ్ నుంచి చిత్తూరు జిల్లాకు పయనం అయ్యారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ నుంచి కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు.
కాగా జన హృదయనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు.
తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. ఇక ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.