కొత్తపల్లికి నా గుండెల్లో చోటిస్తున్నాను:జగన్
నరసాపురం(ప.గో): వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి పార్టీలోనే కాదు.. తన గుండెల్లో చోటిస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా నరసాపురం విచ్చేసిన జగన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కొత్తపల్లికి తనపార్టీలోనే కాదు..గుండెల్లో చోటిస్తున్నానని స్సష్టం చేశారు. ఇదంతా ఎన్నికల సీజన్ అయిన కారణంగా రకరకాల నాయకులొచ్చి..రకరకాల మాటల చెప్పి ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో పింఛన్లు అందని అవ్వా, తాతలు,ఫీజులు కట్టలేక చదువులు ఆపేసిన విద్యార్థులు తనకు ఇంకా గుర్తుకువస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాట కోసం మడమ తిప్పని వాడు, విశ్వసనీయతకు అర్థం తెలిసినవాడు, నిజాయతీ ఉన్నవాడే అసలైన నాయకుడని జగన్ తెలిపారు. ఆ విశ్వసనీయత, నిజాయితీ ఉంది కనుకే దివంగత నేత వైఎస్‌ఆర్ జనం గుండెల్లో ఉండిపోయారన్నారు.
రూ.2 కిలో బియ్యాన్ని రూ.5 చేసిన ఘనత బాబుకే దక్కుతుందని తెలిపారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పగలిగే ఏకైకవ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు.అందుకే అన్నిచోట్లా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 65 ఏళ్లని, ఆయనకివే చివరి ఎన్నికలని జగన్ ఎద్దేవా చేశారు. లక్షా 60వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తారని బూటకపు మాటలు చెబుతున్న బాబు అసలు మనిషేనా?అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తారని కల్లిబొల్లి మాటలు చెబుతూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయని, మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలను చంద్రబాబు ఎలా ఇస్తారని జగన్ నిలదీశారు. ఆయనలాగా దొంగ హామీలను తాను ఇవ్వలేనన్నారు.కాగా ఉభయ గోదావరులను కలిపే బ్రిడ్జిను మాత్రం నిర్మిస్తానని జగన్ హామీ ఇచ్చారు.