
ప్రకటన చేసే పద్ధతి ఇదేనా?: వైఎస్ జగన్
రాజధానిపై బాబు తీరును తప్పుబట్టిన జగన్
సాక్షి, హైదరాబాద్: రాజధానిపై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసాక చర్చించేందుకు ఇంకేముంటుందని ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కీలక అంశంపై ప్రకటన చేసే విధానం ఇదేనా అని నిలదీశారు.అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన అనంతరం జరిగిన చర్చలో జోక్యం చేసుకుని జగన్ మాట్లాడారు. ‘‘అధ్యక్షా.. ముఖ్యమంత్రి ప్రకటన ఇస్తారంటున్నారు. ప్రకటన చేసిన తర్వాత చర్చకు అర్థం ఏముంటుంది? ముందు చర్చ, ఆ తర్వాత ప్రకటన రావాలి. 1953లో కూడా అదే జరిగింది. ఆనాడు రాజధాని నగరాన్ని ఎక్కడ పెట్టాలనే దానిపై ఐదు రోజుల చర్చ జరిగింది. ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం చెప్పారు. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? ప్రజాస్వామ్యం ఉందా? లేదా? ప్రకటన తర్వాత చర్చ జరుపుతామంటున్నారు.
ఇది ఎంతవరకు న్యాయం? రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి సులభమవుతుందని 30 వేల ఎకరాలు ఎక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే అక్కడ పెట్టడం మంచిదన్నాం. వాళ్లు పెడతామన్న చోట గజం రూ.లక్ష పలుకుతోంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో భూసేకరణ ఎలా చేస్తారు? ఇప్పటికే అద్దెలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కాదంటోంది? ప్రకటన చేస్తామంటోంది. దయచేసి బుల్‌డోజ్ చేయవద్దు’’ అంటుండగా స్పీకర్ అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత సందర్భంలో మరోసారి జగన్ జోక్యం చేసుకుంటూ.. తమ న్యాయబద్ధమైన డిమాండ్‌ను అనుమతించాలని కోరారు.
మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం
విజయవాడను రాజధానిగా ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రకటన చేసిన తీరు భయం కలిగించిందని అన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై సభలో జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదన్నారు. రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదని, సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పారు.
భయపడిందే జరిగిందన్నారు. చర్చ తర్వాత ప్రకటన రావాలని కోరుకున్నామని చెప్పారు. ప్రకటన చేసిన తర్వాత చర్చ పెట్టుకోండని చెబితే.. ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ‘‘విభజన తర్వాత 13 జిల్లాల చిన్న రాష్ట్రమయింది. ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదు. రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదు. కానీ.. కనీసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని చెప్పాం. అలా అయితే భూముల ధరలను ప్రభుత్వమే నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. సభలో చర్చ లేకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకొని నేరుగా ప్రకటించడం ప్రజాస్వామ్యం కాకపోయినా, రాష్ట్రంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వకూడదని చర్చలో పాల్గొంటున్నాం. నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం’’ అని జగన్ చెప్పారు.