
'ప్రశ్నిస్తే జగన్ మనుషులని అంటున్నారు'
ఎం చింతకుంట్ల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎవరు ప్రశ్నించినా వారిని జగన్ మనుషులని చంద్రబాబునాయుడు అంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం గోస్పాడు మండలం, ఎం చింతకుంట్ల గ్రామంలో మాట్లాడిన వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని దింపిందికాబట్టే ఇప్పుడు ఏపీ కేబినెట్ మొత్తం నంద్యాల రోడ్లపై వాలిందన్నారు. తాము ఏకగ్రీవం అంటే ఒక్కరైనా నంద్యాల ముఖం చూసేవారా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు గుర్తుకురాని నంద్యాల ప్రజలు ఇప్పుడెందుకు వారికి గుర్తొస్తున్నారని నిలదీశారు.
చంద్రబాబు నైజం అందరికీ తెలిసిందేనని మోసం, దగా ఆయన అలవాట్లని అన్నారు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా ఎప్పుడు పైకి పోతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని సాక్షాత్తు భూమానాగిరెడ్డి బావమరిది అన్నారని, వారు పోతే ఉప ఎన్నికలు వచ్చి తిరిగి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవచ్చని చూస్తున్నారని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే పని ఏ ఒక్కటీ చేయలేదని, ఆయనను ఎవరైనా నిలదీస్తే వారిపై కళ్లెర్ర జేసి 'నువ్వు జగన్ మనిషివి' అంటున్నారని మండిపడ్డారు. కడుపుమండిన రైతులు ప్రశ్నించినా, దగాపడిన అక్కచెల్లెమ్మలు అడిగినా, మోసపోయిన యువత, విద్యార్థులు ప్రశ్నించినా వారిని కూడా 'మీరంతా జగన్ మనుషులే' అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వారంతా చంద్రబాబునాయుడిని బంగాళఖాతంలో కలుపుతారని స్పష్టం చేశారు.
2014 ఆగస్టు 15న సీఎం హోదాలో కర్నూలు వచ్చి జెండా ఎగురేసిన చంద్రబాబు మైకు పట్టుకొని ఏవేవో చేస్తానని చెప్పి వాటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎండగట్టారు. చంద్రబాబుకోసం వచ్చే మంత్రులంతా కూడా దెయ్యాలని, ధర్మానికి ఓటు వేసి అధర్మాన్ని ఇంటికి పంపాలని చెప్పారు. చంద్రబాబు అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. రాబోయే కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నిక నాంది కావాలని, ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యేలలాగే ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి దుర్మార్గుడిని ఓటు ద్వారా ఇంటికి పంపాలని వైఎస్ జగన్ కోరారు.