
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్, విజయమ్మ
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.
కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి నేడు సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.
మరోవైపు వైఎస్ జగన్ బుధవారమంతా ఇడుపులపాయలోనే గడపనున్నారు. గురువారం పులివెందులలో తనను కలిసిన ప్రజలతో మమేకం కానున్నారు. 23న పులివెందులలో వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు.