‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కా చెల్లెళ్ల బిడ్డల చదువు కోసం.. వారి భవిష్యత్ కోసం అమ్మఒడి పథకంపై తొలి సంతకం చేస్తా.. మనుమడిగా అవ్వాతాతలకు నెలకు రూ.700 పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తా.. మూడో సంతకం రైతన్న కోసం పెడతా. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా. నాలుగో సంతకం కూడా అక్కా చెల్లెళ్ల కోసమే పెడతా. వారిని అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు.. కొత్త జీవితాన్నిచ్చేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని జబ్బులకు వైద్యం చేయిస్తా.. అన్నివేళలా మీకు అండగా ఉంటా’ నంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ‘జనభేరి’ ఎన్నికల శంఖారావం సోమవారం రాత్రి కొవ్వూరులో రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద ముగిసింది. ఉదయం 10 గంటలకు చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో రోడ్ షో మొదలు కాగా, అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల కష్టాలు వింటూ.. సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు.
సాక్షి, ఏలూరు : జనం జయజయ ధ్వానాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులపాటు జిల్లాలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల శంఖారావం జైత్రయూత్రలా సాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో జననేత చేపట్టిన రోడ్ షో రాత్రి 9.15 గంటల తరువాత కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నెల 14న నరసాపురంలో జనభేరి మోగించిన వైఎస్ జగన్ మండుటెండలోనూ అలుపెరగకుండా ప్రజల ముందుకు వెళ్లారు. తొలుత మూడు రోజులపాటు పర్యటిం చాలనుకున్నప్పటికీ అశేష జనవాహినిని కలుసుకునేందుకు మరో రోజు పొడిగించారు. తొలిరోజు నరసాపురంలో ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో మొదలై నాలుగు రోజుల్లో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరా రు.
నరసాపురం, పాలకొల్లు, భీమవ రం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. సోమవారం కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తొలు త బ్రాహ్మణగూడెంలో పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినీ దర్శకుడు వీవీ వినాయక్ సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు గండ్రోతు సురేంద్రకుమార్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, చాగల్లు మాజీ ఎంపీపీ కొఠారు మునేశ్వరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేపాటి సూర్యనారాయణ, మండ ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆత్కూరి గోపీచంద్, వ్యాపారవేత్త కొఠారు అశోక్, పలువురు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వందల సంఖ్యలో కార్యకర్తలు జననేత సమక్షంలో పార్టీలో చేరారు. కాన్వాయ్ బ్రాహ్మణగూడెం నుంచి గరప్పాడు మీదుగా ఎస్.ముప్పవరం చేరుకుంది. ముప్పవరంలో కొవ్వూరు మార్కెట్ కమిటీ సభ్యుడు ముప్పిడి మహలక్ష్ముడు వైఎస్సార్ సీపీలో చేరారు.
నుం చి ఊనగట్ల మీదుగా జననేత చాగల్లు చేరుకున్నారు. అశోక్‌నగర్‌లోని కనకదుర్గమ్మ ఆలయూనికి వెళ్లారు. అమ్మవారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిం చారు. ఇక్కడ బీసీ సంఘం మహిళలు పెద్దఎత్తున జగన్‌ను కలిశారు. చాగల్లు ప్రధాన కూడలి వద్ద అక్కడి ప్రజలు గులాబీపూలు చల్లి స్వాగతం పలికారు. ముస్లిం పేటలో వందల సంఖ్యలో మహిళలు ఎదురొచ్చారు. మీనా నగరంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. స్థానిక మత్య్సకారులు ఆవల సత్తి య్య, ఆవల తోటయ్యలతో జననేత మాట్లాడారు. మీనా నగరంలో క్వారీ కార్మికులు ఆయనతో మాట్లాడారు. అక్కడి నుంచి ఐ.పంగిడి, కాపవరం మీదుగా దొమ్మేరు చేరుకున్నారు.
కొవ్వూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ జననేత జమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. చెల్లెళ్లు జగనన్నకు రాఖీ కట్టారు. రాత్రి 8 గంటలకు రోడ్‌షో కొవ్వూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలో పర్యటన ముగించి రోడ్ కం రైలు వంతెన మీదుగా రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట రాజ మండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, పార్టీ సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేనురాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, పార్టీ నాయకులు ముదునూరి నాగరాజు, జీఎస్ రావు, ఆయన కుమారుడు శ్రీనివాసనాయుడు, పెండ్యాల కృష్ణబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, పరిమి హరిచరణ్, గోపాలపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు, ఊదరగొండి చంద్రమౌళి, కోడూరి శివరామకృష్ణ, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కొవ్వూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి అబ్బులు, చాగల్లు మండల వైసీపీ కన్వీనర్ బొర్రా కృష్ణ తదితరులు ఉన్నారు.
‘మన ప్రభుత్వం త్వరలోనే వస్తుంది’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘భయపడకు. ధైర్యంగా ఉండమ్మా.. నేను మీకు అండగా ఉంటా’ అని మానసిక వికలాంగురాలైన మనుమరాలితో వచ్చిన వృద్ధురాలికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభయమిచ్చారు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో కట్టా నర్సమ్మ అనే వృద్ధురాలు తన మనుమరాలైన మూడేళ్ల మానసిక వికలాంగురాలు మనీషను ఎత్తుకుని వైఎస్ జగన్ వద్దకు తీసుకువచ్చింది. ‘ఏమైందమ్మా’ అని ఆయన ఆడగడంతో మెదడు ఎదగకపోవడం వల్ల నడవలేకపోతోందని, మెదడుకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని నర్సమ్మ ఆవేదనతో చెప్పింది. ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఆపరేషన్ చేయడం కుదరదన్నారని.. పేదోళ్లమని.. ఏంచేయాలో తెలియడం లేదని వాపోయింది. ఆమెను ఓదార్చిన జననేత ‘మంచి రోజులొస్తాయమ్మా, ఆరోగ్యశ్రీ కింద అన్ని జబ్బులకు చికిత్స జరిగేలా చూస్తా, మీకు అండగా ఉంటా’నని ధైర్యం చెప్పారు. అదే గ్రామంలో మన్నెం రత్నమ్మ అనే వృద్ధురాలు రూ.200 పెన్షన్ ఇస్తున్నారని, దాంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని బాధను వెళ్లగక్కింది. ‘అతి త్వరలో మన ప్రభుత్వం వస్తుందమ్మా, అప్పుడు పెన్షన్ రూ.700కు పెంచుతాం, అప్పటివరకూ నిబ్బరంగా ఉండండ’ని చెప్పారు. మీనానగరంలో మత్స్యకారులు ఆవల సత్తియ్య, ఆవల తోటయ్యలతో వైఎస్ జగన్ మాట్లాడారు. ‘వేట ఎలా జరుగుతోంది. ఆదాయం ఎంత వస్తోంది. జీవనం బాగుందా’ అని అడిగారు. ఏరోజుకారోజు పూట గడుస్తోందని, వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని మత్స్యకారులు ఆందోళనతో చెప్పారు. మంచి రోజులొస్తాయని వారికి ధైర్యం చెప్పి జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు.