జగన్.. జనభేరి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్సార్ జనభేరి పేర కోదాడ, హుజూర్‌నగర్‌లలో నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగసభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర జరగాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో పర్యటన జరగలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని జగన్ కోసం ఎదురుచూశాయి. ఈలోగా జగన్ సోదరి షర్మిల జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు. గత ఏడాది ఫిబ్రవరిలో మరో ప్రజాప్రస్థానం పేర ఐదు నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ తేదీన కూడా హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో షర్మిల పాల్గొన్నారు. అనూహ్యంగా, స్వచ్ఛందంగా కదిలివచ్చిన జనంతో ఆమె ఎన్నికల ప్రచారం సభలు విజ యవంతమయ్యాయి.
రెండో విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో శనివారం పాల్గొననున్నారు. తొలుత కోదాడలో ఉదయం 10 గంటలకు, తర్వాత హుజూర్‌నగర్‌లో 11.30గంటలకు ఈ సభల్లో ప్రసంగిస్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి, సంక్షేమానికి చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలకు ఇంకా మరిచిపోలే దు. నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందేలా, ప్రపంచబ్యాంకు నిధులతో పాటు, సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించి చేపట్టిన సాగర్ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందే వైఎస్సార్.
పస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరైనా, ఆయన తర్వాత నిధుల విడుదల మందగించింది. అంతేకాకుండా టేలాండ్ భూముల కోసం పదుల సంఖ్యలో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల పథకా లు సైతం ఆయన టైమ్‌లోనే మంజూ రయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు ముంపుతో నష్టపోతున్న ముంపువాసులకు రాష్ట్రంలోనే అత్యం త మెరుగైన ప్యాకేజీకి అనుమతి ఇచ్చింది కూడా వైఎస్సార్ కావడంతో ఆయన పట్ల ఇక్కడి ప్రజల్లో అభిమానం మెండుగా ఉంది.
ఈ కారణంగానే సహకార, పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. ఫలితాలు వెలువడలేదు కానీ, మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సా ర్‌సీపీ అభ్యర్థులు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరి గెలుపు కోసం ఒక తడవ షర్మిల పర్యటించి వెళ్లగా, ఇప్పుడు ఆ పార్టీ అధినేత స్వయంగా ప్రచారానికి వస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.