జలదీక్షకు ‘అనంత’ మద్దతు
కర్నూలు తరలిన నేతలు
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు సంఘీభావం తెలిపేందుకు ‘అనంత’ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, వ్యవసాయ, రైతు సంఘాల నాయకులు బుధవారం తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు బస్సులు, కార్లలో భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద గురునాథరెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా...ముఖ్యమంత్రి చంద్రబాబు కల్లుండి చూడలేని గుడ్డివాడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదులపై అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులతో భవిష్యత్తులో రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు హయాంలోనే కృష్ణాజలాలపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించాయన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతోందన్నారు.
అయినా ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిస్వార్థంగా దీక్ష చేస్తున్నారన్నారు. అందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం తెలిపేందుకు అన్ని వర్గాల వారూ కర్నూలుకు వెళ్తున్నారన్నారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో ఎక్కడ భయంతోనే సీఎం నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పురుషోత్తం, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.