సాక్షి, విజయవాడ: కొలిచెడి వారికి కొంగు బంగారంగా భావించే బెజవాడ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళ్లారు.
గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో ఉన్న గవర్నర్‌ను ఇవాళ సాయంత్రం కలిశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ అనంతరం కడప పెద్దదర్గాలో, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మహానేత ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బెజవాడ దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు
Comments
Please login to add a commentAdd a comment