ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్రాన్ని దోపిడీ రాజ్యంగా మార్చిన పాలకుల దుర్నీతిని ఎండగట్టేం దుకు, సమస్యలతో సతమతమవుతున్న గుండె గుండెకూ అండగా నిలిచేందుకు ఉక్కు సంకల్పంతో ఇడుపులపాయ వద్ద జననేత వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర వందల కిలో మీటర్లు దాటి మార్చి 12న బాపట్ల మండలం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. భావపురిలో జన పరవళ్లతో పరవశించి, స్వర్ణపురిలో జన సంద్రమై, పెదనందిపాడులో ప్రభంజనం సృష్టించింది. చిలకలూరిపేటలో జనకెరటాలతో పోటెత్తి, పల్నాటి గడ్డ నరసరావుపేటలో అక్రమాలపై గర్జించి, సత్తెనపల్లిలో అవినీతిపై శివమెత్తి, పెదకూరపాడులో రైతు నేస్తమై మెరిసింది. పేరేచర్లలో హోరెత్తి, గర్తపురిలో ప్రజా గొంతుకై పాలకుల తీరును ప్రశ్నించింది. ఆంధ్ర ప్యారిస్‌లో జనదీవెనతో మురిసి, ఉండవల్లిలో రాజధాని ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చి కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా ప్రజలు జేజేలు పలుకుతూ జననేత పాదయాత్రకు వీడ్కోలు పలికారు.
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ : మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మార్చి 12వ తేదీన బాపట్ల మండలం వద్ద జిల్లాలోకి ప్రవేశించి, శనివారం కనకదుర్గ వారధి వద్ద ముగిసింది. జిల్లాలో జరిగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఎండలను లెక్క చేయక జననేత అడుగులో అడుగువేసి ముందుకు సాగారు. గ్రామగ్రామానా ప్రజలు పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలకగా, అక్కచెల్లెళ్లు హారతులు పట్టి నుదుట తిలకం దిద్ది విజయోస్తు అంటూ దీవించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని, తామంతా జననేత వెంటే నడుస్తామని యువత కదంతొక్కింది. ప్రతి ఒక్కరి బాధలను ఓర్పుగా ఆలకిస్తూ, ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తానని కొండంత ధైర్యాన్ని నూరిపోస్తూ గన్ ముందుకు సాగారు.
తరలివచ్చిన ప్రజలు
జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర శని వారం ముగియడంతో అధినేతకు వీడ్కోలు పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, నాయకులు తాడేపల్లిలో వైఎస్ జగన్ బస చేసిన ప్రాంతానికి భారీగా తరలి వచ్చారు. జననేత బయటకు రాగానే జైజగన్ అన్న నినాదంతో హోరెత్తించారు. తాడేపల్లి మహానాడు ప్రాంతం నుంచి కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ నగరం వద్ద జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. జననేతను భారీగా జనం అనుసరించడంతో వారధి కంపించింది. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
అంబేడ్కర్‌కు ఘన నివాళి
తాడేపల్లిలో తాను బస చేసిన శిబిరం వద్ద అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్ర పటానికి జననేత వైఎస్ జగన్ శనివారం పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో జననేతకు జ్ఞాపిక బహూకరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌బాబు ఆధ్వర్యంలో గుర్రం బొమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆరిమండ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో బుద్ధుని విగ్రహాన్ని అందజేశారు.
పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లా పరిశీలకులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మొహమ్మద్ ముస్తఫా, పి.రవీంద్రనాథరెడ్డి, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు రావివెంకటరమణ, గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయ కర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్ బాబు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాçష్ట్ర అ«ధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, పార్టీ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, హెనీ క్రిస్టీనా, మేకతోటి సుచరిత, కావటి మనోహర్‌నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, లుక్కాకుల థామస్‌నాయుడు, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, పార్టీ తాడేపల్లి పట్టణకన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ రూత్‌రాణి పాల్గొన్నారు.
జిల్లాలో 26 రోజులు
మార్చి 12వ తేదీన బాపట్ల నియోజకవర్గం స్టువర్టుపురం వద్ద జననేత జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. 26 రోజులపాటు ఈ యాత్ర కొనసాగింది. బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడికొండ, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పేరేచర్ల, పెదకూరపాడు, గుంటూరు, తెనాలి, ఉండవల్లిలో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు పోటెత్తారు. బాపట్ల సమీపంలో వికలాంగుల సదస్సు, ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను శివారులో రైతు సదస్సు జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి సమీపంలో బీసీ ఆత్మీయ సదస్సు, నూర్‌బాషాల సదస్సు, మంగళగిరిలో రాష్ట్ర స్థాయి చేనేత సదస్సు జరిగాయి.
నాలుగేళ్లుగా పంటలు లేవన్నా..
‘నాగార్జున సాగర్ కుడికాలువ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.. నాలుగేళ్లుగా నీరు విడుదలవక వరి సాగుకు దూరమయ్యామన్నా’ అంటూ జననేత ఎదుట రైతులు వాపోయారు. తిండిగింజల మాట దేవుడెరుగు, కనీసం పశువులకు మేత దొరక్క అల్లాడుతున్నామని వివరించారు. నాగార్జున సాగర్‌లో పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 2017 నవంబర్ నాటికి డ్యామ్‌లో 576 అడుగుల మట్టం వద్ద 274 టీఎంసీలు ఉందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరి సాగుకు దూరమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 524 అడుగుల వద్ద నీరు ఉన్నప్పుడే కుడి కాలువకు నీరు ఇచ్చారని గుర్తు చేశారు.
జీఎస్టీ, టీఎస్టీకి తోడు కేఎస్టీ
నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జీఎస్టీ(గూడ్స్ సర్వీస్ ట్యాక్స్), టీఎస్టీ (తెలుగుదేశం ట్యాక్స్) కాకుండా కేఎస్టీ (కోడెల ట్యాక్స్) కూడా చెల్లించాల్సి వస్తోందని జననేత జగన్ ప్రసంగించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రైల్వే భూములు మొదలు రైతుల భూములు కొట్టేయడమేకాకుండా అన్నీ ట్యాక్సులే అంటూ ప్రజలు సైతం జననేతకు విన్నవించారు. కాంట్రాక్టర్లకు కమీషన్ ఇవ్వందే పనులు జరుగవని, అపార్టుమెంట్లు కట్టాలన్నా కేఎస్టీ కట్టాల్సిందేనని పలువురు పేర్కొన్నారు. మద్యం నుంచి తోపుడు బండ్ల వరకు కొత్త సినిమా రిలీజ్ అయినా కేఎస్టీ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉగాది వేడుకలు
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను శివారులో వైఎస్ జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 135 సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని పంచాంగకర్త స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో చేపట్టాల్సిన పోరుపై చర్చించేందుకు ముప్పాళ్ల వద్ద పార్టీ ఎంపీలతో జననేత సమావేశమై దిశానిర్దేశం చేశారు. పేరేచర్ల బహిరంగ సభలో తమ ఎంపీలు రాజీనామాలు చేసిన వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారంటూ జననేత సంచలన నిర్ణయం ప్రకటించారు.
జననేతకు వినతుల వెల్లువ
‘అన్నా మీరే ఆదుకోవాలి’ అంటూ వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కందికి కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీరు – చెట్టు పేరుతో మంచినీటి చెరువులను తవ్వేయడంతో గొంతు తడుపుకొనేందుకూ నీరు లేదని పలు గ్రామాల ప్రజలు వాపోయారు. బాపట్లలో కూరగాయలు, పూల రైతులు తాము పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునే అవకాశం లేదని జననేతకు వివరించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో కరెంట్‌కు నెలకు రూ.50 సర్వీస్ చార్జి చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు బిల్లు రూ.3 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యలు దిగుబడి వచ్చే సమయానికి ధరలు పడిపోతున్నాయని ఆక్వారైతులు విన్నవించారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు రాక పంటలు ఎండిపోతున్నాయని, వరదలు వచ్చినప్పుడు డ్రెయిన్‌లు పొంగి పొలాలు నీటమునుగుతున్నాయని ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులు పేర్కొన్నారు. కాలువలను ఆధునికీకరించాలని కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు అన్యాయం చేశారని, రూ.650 కోట్ల పత్తి స్కామ్ జరిగిందని, యడవల్లిలో కోట్ల రూపాయల విలువైన 416 ఎకరాల భూమిపై తెలుగుదేశం పార్టీ నేతలు కన్నేసి పట్టాలు రద్దు చేశారని దళితులు వాపోయారు.
డయేరియాపై ..
నగరంలో డయేరియాతో 30 మందికి పైగా చనిపోయారని గుంటూరులో జరిగిన బహిరంగ సభలో జననేత విమర్శించారు. పక్కనే కృష్ణా నది ఉన్నా తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో గత ఏడాది డిసెంబర్ 28న జరి గిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, ఆటోడ్రైవర్ చనిపోయారని, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి మోసగించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ భూకబ్జాల్లో ఘనాపాటిగా మారారని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల ప్రాంతంలో రైతులు పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని జననేత దృష్టికి తమసమస్యలను తీసుకొచ్చారు. స్వయంగా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి వారి సమస్యలను రాసుకుని, పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో చేనేతలు పడుతున్న కష్టాలను పరిశీలించారు. తాడేపల్లి బహిరంగ సభలో ఇసుక, మట్టి మాఫియా గురించి ప్రస్తావించారు. సీఎం కనుసన్నల్లోనే ఇసుక మాఫియా జరుగుతుందని విమర్శించారు.
జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సాగింది ఇలా...
జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సాగిన రోజులు : 26
నడిచిన దూరం : 281 కి.మీ.
పాదయాత్ర సాగిన నియోజకవర్గాలు : 12
16 మండలాల్లో జననేత సందర్శించిన గ్రామాలు : 151
జరిగిన బహిరంగ సభలు : 11
Comments
Please login to add a commentAdd a comment