సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్షించారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. దుర్గగుడికి వచ్చే యాత్రికుల వల్ల పనులు నిలుపుదల చేస్తున్నామని, జనవరి నెలాఖారుకు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ కూడా పూర్తిచేయాలని సీఎం కోరాగా, డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆర్‌అండ్‌బి శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించాలని, జనవరిలో భర్తీ కోసం క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు.
అంచనాలలో వాస్తవికత ఉండాలి..
రోడ్ల నిర్మాణం అంచనాల విషయంలో వాస్తవికత ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మనం ప్రతి పనికి రివర్స్ టెండర్లు పిలుస్తున్నామని.. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువ టెండర్లు ఖారారవుతున్నాయని వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో కూడా ఇదే పద్దతిని పాటించాలని సూచించారు. ఇక్కడ కూడా రివర్స్ టెండర్లు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. సింగిల్ లైన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిందని.. చేసే రోడ్ల విస్తరణ ఏదైనా రెండు లైన్ల రోడ్లుగా విస్తరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రతిపాదనలకు సీఎం అంగీకారం..
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేపై సమావేశంలో చర్చ జరిగింది. భూ సేకరణపై ప్రధానంగా దృష్టిపెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఇనీషియల్‌గా నాలుగు లైన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లైన్ల రోడ్డు వరుకూ భూ సేకరణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు లైన్లకు సరిపడా టన్నెల్స్ ఉండేలా చూడాలని సీఎం సూచించారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేను చిలకలూరి పేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు.
రోడ్లకు మహర్దశ
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ. 6,400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్ల అభివృద్ధి, అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న రుణ సహాయం రూ.6,400 కోట్లనుంచి రూ.8,800 కోట్లకు పెంచేందుకు సీఎం నిర్ణయించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బలోపేతానికి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించారు.
జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ
సమీక్షలో నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా తరపున పాల్గొన్న రీజనల్ అధికారి అనిల్ దీక్షిత్.. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను సీఎంకు వివరించారు. గుండుగొలను-గొల్లపూడి, కలపర్రు-మంగళగిరి బైపాస్ హైవేపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పనుల్లో ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటే జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నగరాన్ని ట్రాఫిక్ నుంచి విముక్తి చేసేందుకు ఇదొక పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అనకాపల్లి – ఆనందపురం రోడ్డు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతోందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒంగోలు–కత్తిపూడి జాతీయ రహదారికి సంబంధించి కూడా అక్కడక్కడ చిన్నస్థాయిలో పనులు మిగిలిపోయాయని, వాటినికూడా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులను సీఎంకు వివరించారు. రేణిగుంట నుంచి కడప, రేణిగుంట నుంచి నాయుడుపేట, నెల్లూరు నుంచి తడ వరకూ ఆరులైన్ల రహదారి తదితర ప్రాజెక్టులను వివరించారు.
రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు వివరించారు. పట్టణాలు, నగరాల్లోని సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎన్‌హెచ్‌ఏఐకు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. అలాగే రేషన్ పంపిణీలో భాగంగా బియ్యాన్ని ప్యాక్ చేసేందుకు ఇస్తున్న సంచులను తిరిగి సేకరించి వాటిని పునర్ వినియోగించడం లేదా, రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల సరఫరాపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి ధర్మాన కృష్ణదాసు, ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు, నేషనల్ హైవేస్, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment