పోలవరంపై అధికారులకు సీఎం జగన్‌ మార్గనిర్దేశనం | YS Jagan Review Over Polavaram Project Works | Sakshi
Sakshi News home page

పోలవరంపై అధికారులకు సీఎం జగన్‌ మార్గనిర్దేశనం

Published Fri, Feb 28 2020 5:30 PM | Last Updated on Fri, Feb 28 2020 6:17 PM

YS Jagan Review Over Polavaram Project Works - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వీక్షించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌.. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడంపై అధికారులు, ఇంజనీర్లకు మార్గనిర్దేశనం చేశారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో నిశితంగా మాట్లాడారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌.. గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్నారు. ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులు ఆదేశించారు.

జూన్‌ కల్లా స్పిల్‌వే పనులు పూర్తి కావాలి..
2021 సీజన్‌కు ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు‌. దీనివల్ల పంటలకు నీటిని అందించే వీలుంటుందని చెప్పారు. గతంలో ప్రణాళిక లోపం, సమన్వయ లోపం, సమచారం లోపం ఉందని గుర్తుచేశారు. దీనివల్ల గత సీజన్‌ను కోల్పోయామని.. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదని ఆదేశించారు. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కూడా ప్రాజెక్టు పనులు జరగాలని తెలిపారు. పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిల్‌ వే పనులు జూన్‌ కల్లా పూర్తి కావాలని, అదే వేగంతో అప్రోచ్‌ ఛానల్‌ కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ నాటికి స్పిల్‌వేను అందుబాటులోకి తీసుకువస్తే.. నదిలో నీటిని స్పిల్‌వే మీదుగా తరలించే అవకాశం ఉంటుందన్నారు.

ఢిల్లీలో ప్రత్యేక అధికారిని ఉంచాలి..
‘అదే విధంగా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరగాలంటే కాఫర్‌ డ్యామ్‌లో ఇప్పుడున్న ఖాళీలను కూడా భర్తీచేయాల్సి ఉంటుంది.  కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాల్సి ఉంటుంది. మరోవైపు కాఫర్‌ డ్యామ్‌ పూర్తిచేసేసరికి ముంపు పెరుగుతుంది. అందువల్ల ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలి. అందుకే సహాయ పునరావాస పనులపై ఇప్పటినుంచే దృష్టిపెట్టి ఆ పనులను ప్రారంభించాలి. పనుల డిజైన్లు అనుమతుల్లో ఆలస్యం కాకుండా ఉండాలంటే.. వాటిపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాలి. వీటి ఫాలో అప్‌కోసం, సత్వరంగా అనుమతులు తెప్పించుకోవడం కోసం ఢిల్లీలో ఒక అధికారిని ఉంచాలి. డ్రాయింగులు, డిజైన్ల అనుమతికోసం, లైజనింగ్‌ కోసం ఒక అధికారిని పూర్తిగా పెట్టండి. స్పిల్‌వే ఛానల్‌లో మొన్నటి వరద కారణంగా... బాగా సిల్ట్‌ పేరుకుపోయింది. దీనివల్ల ఎక్కడ కాంక్రీట్‌చేశారు, ఎక్కడ చేయలేదన్నది గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత కాలంలో ఈ సిల్ట్‌ మరింతంగా పెరుగుతుంది. దీనికోసం సరైన పరిశోధన చేసి.. ఎక్కడ కాంక్రీట్‌ చేశారు, ఎక్కడ చేయలేదన్నదీ ఇప్పుడే గుర్తించాలి. పనులు వేగంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. గతంలో అప్రోచ్‌ ఛానల్‌ కూడా చేయకపోవడంవల్ల.. ఈ సిల్ట్‌ వచ్చి పేరుకుపోయింది. కుడి, ఎడమ కాల్వలను  అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాల’ని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రెండు వైపులా టన్నెల్‌ తవ్వకం పనుల ప్రగతిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఫోకస్‌గా ముందుకు సాగాలి.. 
జూన్‌ కల్లా రైట్‌ మెయిన్‌ కెనాల్‌ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు చెప్పారు. రైట్‌ మెయిన్‌ కెనాల్‌ టన్నెల్‌లో లైనింగ్‌ కూడా పూర్తువుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. జూన్‌కల్లా తప్పకుండా నీరు పోయేలా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎడమకాల్వ కనెక్టివిటీకి సంబంధించి రెండు ప్యాకేజీల్లో పనులు నడుస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్‌తోపాటు ఎడమ కాల్వ పనులు కూడా వేగవంతంగా అయ్యేలా చూడాలని తెలిపారు. మళ్లీ నీరు వచ్చి గండ్లు పడే పరిస్థితులు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు ముందుకు సాగాలంటే మనకున్న సమస్యలు, అడ్డంకులు ఏమిటో వాటిని గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్‌ నుంచి అక్టోబరు వరకూ పనులు ఆగిపోకుండా ఉండాలంటే.. ఏయే పనులు కావాలి, వాటికి సంబంధించిన ఏం అనుమతులు కావాలి, ప్రాధాన్యతా క్రమంలో ఏం చేయాలన్నదానిపై ఒక జాబితా రూపొందించుకుని ఫోకస్‌గా ముందుకు పోవాలని సూచించారు. అలాగే స్పిల్‌వే ముందు భాగంలో నిర్మించాల్సిన బ్రిడ్జిపైనా సీఎం పర్యటనలో చర్చ జరిగింది. ఈ బ్రిడ్జిని ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌తో అనుసంధానించేలా డిజైన్‌ చేయాలని.. తద్వారా నాలుగు వరుసల రహదారి ఏర్పడుతుందని అధికారులు సీఎంకు వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. డిజైన్‌ ఖరారుచేసి ఆమేరకు పనుల విషయంలో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సంద్భంగా ఆ బ్రిడ్జికి ‘వైఎస్సార్‌ గేట్‌ వే’ గా పేరుపెట్టాలని ప్రతిపాదన వచ్చింది.

ముంపు ప్రాంతాలపై సీఎం సమీక్ష..
అదే విధంగా పోలవరం ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ పునరావాస కార్యక్రమాలపైన సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కాఫర్‌ డ్యామ్‌లో ఇప్పుడున్న ఖాళీలను పూర్తి చేస్తే గోదావరిలో 41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. దీనివల్ల వెంటనే 17వేలకుపైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ఆ మేరకు సహాయ పునరావాస పనులపై ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధంచేసుకోవాలని సూచించారు. 

ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల కోసం ఒక ప్రత్యేక అధికారిని పెట్టామని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదని, ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదులు ఉండకూడదని, మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 35 కాంటూరులో కూడా 6 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని.. వీటిని తరలించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దేవీపట్నం మండలంలో 6 గ్రామాలను తక్షణం తరలించాల్సి ఉంటుందన్నారు. భధ్రాచలంలో మూడోవిడత ప్రమాద హెచ్చిరిక వస్తే ఈ గ్రామాలు మునుగేవని, కానీ ఇప్పుడు మొదటి ప్రమాదహెచ్చరిక వస్తేనే ఆ గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ఆమేరకు సహాయపునరావాస పనులకు సిద్ధం కావాలని ఆదేశించారు. పునరావాలస కాలనీల్లో పనులకు అవసరమైన డబ్బు విడుదల చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement