సమర శంఖారావరం సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తదితరులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు నుంచే మార్పునకు నాంది పలుకుతున్నారు. సమర శంఖారావం వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించి కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడి నుంచే సమరశంఖం పూరించనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సమర శంఖారావం జరిగే వేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఊహకందని విధంగా ఎన్నికల తేదీ ఖరారైంది. పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. ఇంకేముంది సమర శంఖారావం వేదికగా విజయ ఢంకా మోగించనున్నారు.
తూర్పు మార్పుకు నాంది అని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో తమకో మంచి సంకేతమని, పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే వేదికగా కాకినాడ నిలవడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, వైఎస్సార్‌సీపీ విజయానికి ఇక్కడ నాంది పలుకుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షలకుపైగా ఓటర్లు, 19 నియోజకవర్గాలున్న జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్త శ్రేణులకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులతో జరిగే సమావేశంలో ఎన్నికల సమరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచార సంగ్రామంలో మొదటి సభగా కాకినాడ కానుండటంతో జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను తలశిల రఘురాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కర్రి వెంకటరమణ, పార్టీ నాయకులు కర్రి పాపారాయుడు తదితరులు పర్యవేక్షించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా శ్రేణులు తరలివస్తుండటంతో కాకినాడలో రాజకీయ సందడి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment