‘ఆసరా’తో ఆదుకుంటాం | YS Jagan says that We are launching revolutionary activities in the medical and health sector | Sakshi
Sakshi News home page

‘ఆసరా’తో ఆదుకుంటాం

Published Tue, Dec 3 2019 4:06 AM | Last Updated on Tue, Dec 3 2019 8:02 AM

YS Jagan says that We are launching revolutionary activities in the medical and health sector - Sakshi

మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా..
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి బ్యూరో: మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నామని సోమవారం గుంటూరులో ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్‌ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామని సీఎం వివరించారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చేసి అపోలో లాంటి కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకోసం రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. 



మాట నిలబెట్టుకుంటున్నా...
‘నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. గుంటూరు వేదికగా ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పేదలు ఆపరేషన్‌ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి కడుపు నిండటం కోసం మళ్లీ పనుల కోసం పరుగెత్తుతున్నారు.

ఈ పరిస్థితుల్ని మారుస్తూ శస్త్రచికిత్స అనంతరం రోగిని ఆప్యాయంగా పలుకరిస్తూ కోలుకునేందుకు వీలుగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా దీన్ని ప్రారంభించాం. ఆపరేషన్‌ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులు ఇంట్లో పస్తులు ఉండకుండా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల వరకు  చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా  చికిత్సానంతర ఈ జీవనోపాధి భృతిని అందజేస్తాం. ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సహాయం ఎంత కాలం ఇవ్వాలన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్ణయిస్తారు. సంపాదించే వ్యక్తి రోగాలతో బాధపడుతుంటే ఆ కుటుంబాలు ఆదాయం లేక ఎంత సతమతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఆ కుటుంబాలన్నింటికీ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను...’’ అని ఆ రోజు చెప్పా. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉంది.
గుంటూరు మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సభలో హాజరైన ప్రజలు  

జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. 3,648 కిలోమీటర్ల మేర సాగిన నా పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే.. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్‌ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్‌ రిపోర్టును పొందుపరుస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తాం. తొలిదశలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్‌ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 

మూడు మహానగరాల్లోనూ వర్తింపు
వచ్చే ఏప్రిల్‌ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం. ఫోన్‌ కొట్టిన 20 నిమిషాల్లోనే మంచి అంబులెన్స్‌ మీ ముందు ఉంటుంది. మంచి ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది పడకుండా చెక్కు మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి తెస్తాం. ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో నవంబర్‌ 1 నుంచే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలి. ‘ఏ’ గ్రేడ్‌  నుంచి ‘ఏ’ ప్లస్‌ గ్రేడ్‌కి ఆర్నెళ్లలో మారాలి. అలా మారని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ నుంచి తొలగిస్తాం.  

రాష్ట్ర ప్రజలందరికీ ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’.. 
ఆర్నెళ్లు తిరగక ముందే ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఓ వర్గాన్ని ఈ పథకంలోకి తెస్తాం. విద్యార్థుల తర్వాత అవ్వా తాతలకు దీన్ని వర్తింపజేస్తాం. ఆ తర్వాత ఆర్నెళ్లకు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తానికి పథకాన్ని అమలు చేస్తాం.

ప్రభుత్వాసుపత్రుల్లో 510 రకాల ఔషధాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 15వతేదీ నుంచి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలను మాత్రమే అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్‌ రోగులకు మన ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్‌ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్‌ చెల్లిస్తాం. బోధకాలు, కిడ్నీ బాధితుల(స్టేజ్‌ 3, 4, 5)ను రూ.5 వేల పెన్షన్‌ కేటగిరీలోకి తెస్తాం. లెప్రసీ బాధితులను రూ.3 వేల పెన్షన్‌ కేటగిరీలోకి తెచ్చి ప్రతి రోగికీ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తాం. కేన్సర్‌ పేషెంట్లను కూడా మార్పులతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. వారికి ఎన్ని దశల చికిత్స అవసరమైన పూర్తిగా భరిస్తాం. పుట్టుకతో మూగ, చెవుడు లోపం కలిగిన చిన్నారులకు రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అందచేస్తాం.

అలవాట్లు మారినప్పుడే...
ప్రజల అలవాట్లు మారినప్పుడే వైద్యంపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. అందుకనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. దాదాపు 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్‌రూంలు లేకుండా చేశాం. 4,500 మద్యం షాపులను 3,500కి తగ్గించాం. పర్మిట్‌ రూమ్‌లు లేకుండా చేస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం షాపులను మూసివేస్తున్నాం. ప్రైవేట్‌ వ్యాపారుల్లాగా లాభాపేక్ష ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేశాం. బార్లను కూడా 40 శాతం తగ్గించేశాం. మద్యం ధరలు షాక్‌ కొట్టేలాగే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతున్నాం.

మూడేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం
డిసెంబర్‌ చివరి వారంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో లాంటి కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చిస్తాం. విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం. మే నెల నాటికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఈ అడుగులు ఒకవైపు వేస్తూనే ఒక మంచి సమాజం ఉండాలనే ఉద్దేశంతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. నిధుల కొరత ఉన్నా, నావద్ద ఎలాంటి మంత్రదండం లేకున్నా.. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజల దీవెనతో అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement