ఉద్యోగులకు భరోసా..! | YS Jagan Schemes For All Category's | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు భరోసా..!

Published Fri, Apr 5 2019 10:31 AM | Last Updated on Fri, Apr 5 2019 10:31 AM

YS Jagan Schemes For All Category's - Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉద్యోగుల హక్కులు నానాటికీ హరించుకుపోతున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రశ్నించలేని దుస్థితి. గడిచిన ఐదేళ్లలో ఒక్క డిమాండ్‌ను పరిష్కరించుకోలేకపోయారు. వేతన సవరణ సాధించుకోలేకపోయారు. మధ్యంతర భృతి మధ్యలోనే ఆగింది. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు చేయాలని గొంతెత్తి ఘోషించినా ప్రయాసే మిగిలింది. ఇక పొరుగు సేవల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. గొడ్డు చాకిరీ చేస్తూ.. గొర్రె తోక సంపాదనతో అల్లాడుతున్నారు.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నభోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా పోయింది. ఇలా ఒకరేంటి అందరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకునే శక్తిని కోల్పోయారు. ఉద్యోగ సంఘాలు వీరి సమస్యలపై ఉద్యమాలు చేయడం లేదు. ఉద్యోగులు నోరుమెదిపి వారి హక్కులనో.. డిమాండ్లనో ప్రస్తావిస్తే జీతాలే సరిగ్గా ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చంద్రబాబు నూరిపోసిన మాటలతో ఉద్యోగులు అభద్రతాభావంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని వారి ఆశలకు జీవం పోశారు. 

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం 2004 నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానం ఉద్యోగులకు పెన్షన్‌ భద్రతను దూరం చేసింది. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గినందునే ఈ సీపీఎస్‌ అమలులోకి వచ్చింది. జిల్లాలో 20  వేల మంది ఉద్యోగులు 2004 తర్వాత వివిధ సందర్భాల్లో నియమితులయ్యారు. వీరికి నెలవారీ జీతాల బిల్లులో పది శాతం మొత్తాన్ని కోత విధించి ప్రభుత్వం షేర్ల వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచుతోంది. దీనికి ఏపాటి భద్రత ఉందన్నది ఉద్యోగుల వాదన. దీనిపై ఉద్యోగులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదు. సీపీఎస్‌పై పోరాడిన వారిపైనా వేటు వేసింది బాబు సర్కార్‌. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో ప్రధానమైన 96 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు కలిపి 56 వేల మందికి పైగా ఉన్నారు. పెన్షనర్లు సుమారుగా 20 వేల మంది ఉన్నారు. టీడీపీ పాలనలో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరు. అధికారులు తమ ఇంటి ముఖం చూడడానికి ఏ అర్ధరాత్రో అపరాత్రో కావాల్సిందే. నిత్యం రిపోర్టులు.. అర్థంపర్దం లేని నివేదికలతో కాలయాపన. ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి నుంచి ఏం కావాలో తెలియదు. గంటకో ఫార్మాట్‌.. వెంటనే వివరాలివ్వాలని వేధింపులు. దీంతో ఉద్యోగులు, అధికారులు విసిగిపోయారు. ఇక చాలు ఈ వేధింపులు అన్న ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలు ఒక భరోసా నింపాయి.

కాంట్రాక్టు కార్మికులకు వరం
జిల్లాలో అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. విద్యుత్, డీఆర్‌డీఏ, డ్వామా తదితర శాఖల్లో ఐదు వేల మంది అరకొర వేతనంతో పని చేస్తున్నారు. వీరిక ఉద్యోగ భద్రత లేదు. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా పని ఉన్నా ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు. రాయితీలు లేవు. కాంట్రాక్టు ఉద్యోగులు ఎప్పటి నుంచో క్రమబద్ధీకరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని జగన్‌ ఇచ్చిన హామీతో వారిలో ఒక నమ్మకం మొలకెత్తింది.

ఐఆర్‌ 27 శాతం.. ఉద్యోగుల్లో ఆనందం
ఉద్యోగుల మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడానికి జగన్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు గీత గీసి బేరమాడి 20 శాతం ఐఆర్‌ ఇస్తానన్నారు. ఉద్యోగులు తమకు హక్కుగా రావాల్సిన మధ్యంతర భృతి విషయంలోనూ భిక్ష వేస్తున్నట్లుగా ఉందన్న అసంతృప్తి ఉంది. జగన్‌ 27 శాతం ఐఆర్‌తో అటెండర్‌ నుంచి అధికారుల వరకు సుమారు వారు తీసుకొనే మూలవేతనంపై 38–42 శాతం వరకు వేతనం పెరుగుతుంది. జిల్లాలోని ఉద్యోగులపై ఐఆర్‌ పెంపుదల నేపధ్యంలో సుమారు రూ.180 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నా ఈ పెంపుదల అమలు చేయడానికి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత వరకు 11వ వేతన సవరణ కమిటీని వేయలేదు. పూర్వ బకాయిలను గత ఏడాది డిసెంబర్‌లో ఇవ్వడం గమనార్హం. వేతనాల్లో కోతతోపాటు వారికి చెల్లించాల్సిన డీఏ, టీఏ తదితరాలకు బడ్జెట్‌ లేదంటూ, బడ్జెట్‌ మురిగిపోయిందంటూ చెల్లింపులను వాయిదా వేయడం గమనార్హం. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల పీఆర్సీని కచ్చితంగా సమయానికి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్‌ ధీమా కల్పించారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ
జిల్లాలోని వివిధ శాఖల్లో 18 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయనందున ఒక ఉద్యోగిపై నలుగురి భారం పడుతోంది. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చి కొంత పని తగ్గించినా మాన్యువల్‌గా చేయాల్సిన పని భారం వీరికి తప్పడం లేదు. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టుల కన్నా 37 శాతం ఖాళీలు ఉన్నాయి. వీటిని ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. ఒక్క రెవెన్యూలోనే 450 ఖాళీలు ఉన్నాయి. కలెక్టర్‌ కార్యాలయంలో క్షేత్ర స్థాయి ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. అయినా కొత్త పోస్టులు ఇవ్వకుండా, కొత్త డీఎస్సీలు వేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నెట్టుకొస్తున్నారు.

అంగన్‌వాడీలు.. ఆశా వర్కర్లకు..
జిల్లాలో సుమారు తొమ్మిది వేల మంది అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపునకు జగన్‌ హామీ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలతో వీరు క్షేత్ర స్థాయిలో చాకిరీ చేస్తున్నారు. వీరి పనిపై విధి విధానం లేదు. పై అధికారులు ఏ హుకుం జారీ చేసినా వీరు విధుల్లో ఉండాల్సిందే. వీరు కొన్ని సందర్భాల్లో శాఖేతర పనులు చేస్తున్నారు. వెట్టిచాకిరీ చేస్తున్నా వీరికి తగిన వేతనాలు ఉండడం లేదు. వీరిపై అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీరికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు వంటి లబ్ధి చేకూర్చడానికి జగన్‌ హామీ ఇచ్చారు.

నాలుగో తరగతి ఉద్యోగులకు అభయం
నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ ఉంది. వీరి గోడును చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. ఫలితంగా జిల్లాలోని 780 మంది నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇటీవల 56 మంది ఉద్యోగ విరమణ చేశారు. జగన్‌ నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని భరోసా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్సులు కూడా పరిమితం చేస్తానని, పోలీసు ఉద్యోగులకు వారంతపు సెలవు ఇస్తానని, ప్రభుత్వ డ్రైవర్ల వ్యవస్థ పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని జగన్‌ ఇచ్చిన హామీపై ఆయా రంగాల్లోని 7 వేల మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమాన పనికి  సమాన వేతనం
జిల్లాలో పొరుగు సేవల్లో సుమారు 12 వేల మంది వరకు పని చేస్తున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్యుత్‌ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరికి వేతనం ఏజెన్సీల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది సంస్థలు పొరుగు సేవకులను ఆయా శాఖలకు సరఫరా చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారికి ఏడాది వేతనం ఒక్కసారే ఇస్తున్నారు. నెలనెలా వీరికి వేతనాలు ఉండవు. ప్రభుత్వం వద్ద కాస్త నిధులు సమకూరినప్పుడు మాత్రమే వీరికి చెల్లింపులు చేస్తున్నారు. పొరుగు సేవల్లో పని చేసే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వీరికి పనివేళలు అమలులో లేవు. ఇచ్చే కాంట్రిబ్యూషన్‌లో పది శాతం ఆయా సంస్థలు చార్జీల కింద తీసుకుంటాయి. భారంగానే వీరు పొరుగు సేవల్లో పని చేస్తున్నారు. జగన్‌ సీఎం అయిన వెంటనే పొరుగు సేవలకు ఒక బధ్రత ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామంటున్నారు. హోంగార్డుల వేతనాలను పెంచుతామంటున్నారు.

పెన్షనర్లకు ప్రత్యేక కేంద్రం
ప్రతి జిల్లాలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జగన్‌ హామీ ఇచ్చారు. జిల్లాలో సుమారు 20 వేల మంది సర్వీసు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు. ఒంగోలు కేంద్రంగానే 9 వేల మంది ఉన్నారు. వీరికి రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటికి జవాబు చెప్పడానికి ప్రత్యేకంగా విభాగం లేదు. ఉద్యోగుల వద్దకు వెళ్లినా వారి నుంచి సరైన జవాబు రావడం లేదు. ఏటా సమర్పించే లైఫ్‌ సర్టిఫికెట్లు, ఐటీ రిటర్నులు, ఇతర రాయితీలు, మినహాయింపులు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా సంప్రదింపులు జరిపే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా పెన్షనర్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక సమస్యపై పదే పదే తిరిగే సమస్య తీరుతుంది.

ఉద్యోగులను జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుదే..
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కోరుతూ రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై కేసులు పెట్టి, జైళ్లలో వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. గత రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేయడంతో పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా పీఆర్‌సీ ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. పీఆర్‌సీ పెంచకపోగా, 40 శాతం ఐఆర్‌ అడిగితే 20 శాతం ఇచ్చారు. గతంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఎటువంటి పారితోషికం అందలేదు. వారి కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
– కాసులనాటి అమరేశ్వరప్రసాద్, రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌(యర్రగొండపాలెం)

ఐఆర్, పీఆర్‌సీ, డీఏపై హర్షం


ఐఆర్, పీఆర్‌సీ, డీఏలు సకాలంలో ఇస్తానని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులకు చెందిన సమస్యలన్ని పరిష్కరిస్తానని చెప్పారు. అదే విదంగా దీర్ఘకాలంగా ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిని అర్హతను బట్టి రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించారు. చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. వేతన జీవులకు సరైన న్యాయం చేస్తానని ప్రకటించడం హర్షణీయం. 
– ఉడుముల శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు

ఉద్యోగుల బాధలు గుర్తించడం హర్షనీయం
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల బాధలు గుర్తించి మధ్యంతర భృతి 27 శాతం పెంచుతానని ప్రకటించడం చాలా ఆనందకర విషయం. పెరుగుతున్న ధరలతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఐఆర్‌ పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు మేలు చేస్తుంది. 
– శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, దర్శి 

యూనియన్లు పెద్దల సంక్షేమానికా.. 


రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉద్యోగులు నాలుగేళ్లుగా సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మొర ఆలకించిన ఒక మహానుభావుడు నేను విన్నాను–నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం రెండు లక్షల మంది జీవితాల్లో వెలుగొస్తుందని కృతజ్ఞతలు తెలిపిన సీపీఎస్‌ ఉద్యమకర్త రామాంజనేయులు యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం చాలా దారుణం. రామాంజనేయులుకు సంఘీబావం ప్రకటించకుండా సీపీఎస్‌ ఉద్యమం చేయడమే తప్పుగా చెత్త మెసేజ్‌లు వ్యాప్తి చేయడం సరికాదు. కొందరు పెద్దల సంక్షేమమే విధిగా యూనియస్‌లు పనిచేస్తుండటం దురదృష్టకరం.  
– బాజీ పఠాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ సీపీఎస్‌ఇఏ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement