మంగళవారం విశాఖలోని శారదాపీఠంలో సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదిస్తూ నుదుటిమీద బొట్టుపెడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
సాక్షి, విశాఖపట్నం: నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి మంగళవారం విశాఖ పర్యటనకు విచ్చేశారు. గన్నవరం నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులందరినీ ఆయన పేరుపేరునా పలుకరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎన్‌ఎడీ, వేపగుంట మీదుగా మధ్యాహ్నం 12.20 గంటలకు పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలో ఉన్న శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు.
పీఠం సంప్రదాయం ప్రకారం మేళతాళాల మధ్య గురువులు, వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. పీఠంలోని జగద్గురు సన్నిధిలో వేంచేసి ఉన్న పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిజీని వైఎస్ జగన్ దర్శించుకుని వారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామిజీని తులసి, పుష్పమాలలతో సత్కరించి పట్టు వస్త్రాలు, పండ్లు బహూకరించారు. స్వామిజీతో కొద్దిసేపు మాట్లాడారు. భేటీ అనంతరం స్వామిజీతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వర్ణమండపంలో కొలువైన అమ్మవారి సన్నిధిలో స్వామిజీ స్వయంగా పూజలు నిర్వహించి సీఎంను ఆశీర్వదించారు. అక్కడి నుంచి పీఠంలోని వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి, మేధా దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శారదాంబ పీఠార్చన ప్రాంగణాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
సింహాచలం వేద పండితుల ఆశీర్వాదం
సింహాచలం దేవస్థానం వేద పండితులు పీఠంలో సీఎంను దుశ్శాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో చంద్రమోహన్ అప్పన్న చిత్రపటాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. పీఠంలో సుమారు రెండు గంటల పాటు గడిపిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరగా, పీఠం ఉత్తరాధికారి బాల స్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, పీఠం ప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో గన్నవరం బయల్దేరారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, డాక్టర్ భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్, అవంతి శ్రీనివాస్, పెట్ల ఉమా శంకర గణేష్, చెట్టి ఫల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, ధర్మాన కృష్ణదాస్, విశ్వసరాయ కళావతి, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, తెర్లం బాలరాజు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వర రావు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరరావు, బలిరెడ్డి సత్యారావు, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం 3.40 గంటలకు వైజాగ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment