గిట్టుబాటు ధర దక్కక ఆందోళన బాటపట్టిన పొగాకు రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. ‘మీ కోసం ఎందాకైనా వస్తా.. రైతుల కష్టాలు, నష్టాలు తీర్చేందుకు దేనికైనా సిద్ధమే’నని ప్రకటించారు. కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కక.. పొగాకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక.. పాలకులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో అల్లాడిపోతున్న రైతులకు వైఎస్ జగన్ పర్యటన స్థైర్యాన్నిచ్చింది. ‘ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర తెచ్చుకునేందుకు పోరాడదాం.. పదో తేదీ నాటికి సర్కారు దిగిరావాలని అల్టిమేటం జారీ చేస్తున్నాం.. లేదంటే వేలం కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టి శంఖారావం మోగిద్దాం’ అని రైతుల హర్షధ్వానాల మధ్య వైఎస్ జగన్ ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం 12గంటల తర్వాత వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు కేంద్రానికి విచ్చేశారు. అప్పటికే అక్కడున్న వేలాది మంది రైతులకు అభివాదం చేసిన ఆయన పొగాకు బేళ్లను, కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు వేలం కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ రైతులు, కొనుగోలుదారులు, వేలం నిర్వహణ అధికారులతో ఆయన మాట్లాడారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రైతు మాగంటి సాయిబాబు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి కిలో రూ.175 ఉన్న కిలో పొగాకు ధర ఈ ఏడాది రూ.130కి తగ్గిపోయిందని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది జూలై నెల ప్రారంభానికి దాదాపు 50 మిలియన్ల కిలోల పొగాకును వివిధ కంపెనీలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 17 మిలి యన్ కేజీలు మాత్రమే కొన్నాయని చెప్పారు. గత పరిస్థితికి ఇప్పటికి ఎందుకు తేడా వచ్చిందని ఐటీసీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్‌ను వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇందుకు ఆయన వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం పొగాకు ఎగుమతులకు అనుమతులను నిలిపివేసిందని తెలిపారు. కంపెనీల నుంచి డిమాండ్ కూడా తగ్గిందని చెప్పారు.
బ్యాంకర్లు ముష్టివాళ్లుగా చూస్తున్నారు : రైతు ఆవేదన
వేలం కేంద్రం ప్రాంగణంలోనే వైఎస్ జగన్ తొలుత రైతులతో మాట్లాడించారు. మధ్యాహ్నపు ఏసు అనే రైతు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగా కు రైతులను బ్యాంకు అధికారులు ముష్టివాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడవటి నాగేశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ చంద్రబాబు పొగాకు కంపెనీల వద్ద కోట్లాది రూపాయల లంచాలు తీసుకుని పొగాకు రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు.
జగన్ రాకతో పాపప్రక్షాళన
ఎన్నికల ప్రచారంలో భాగంగా పొగాకు బోర్డుకు చంద్రబాబు రావడంతో రైతులకు దరిద్రం పట్టుకుందని, వైఎస్ జగన్ అడుగుపెట్టడంతో ఇప్పుడు పాపప్రక్షాళన జరిగిందని రైతు కొడవటి నాగేశ్వరరావు ఆవేశంగా మాట్లాడగా, మిగిలిన రైతులు పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు. ‘మీరు వస్తున్నారని తెలిసే రెండు రోజులుగా కేజీకి రూ.20 రేటు పెంచారు’ అని రైతులు చెప్పారు.
సిగ్గు లేదా బాబూ..నిప్పులు చెరిగిన జగన్
రైతులు, వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పొగాకు రైతుల కోసం ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టీసీ) ద్వారా కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతుంటే బాబు సిగ్గులేకుండా అది తన పరిధిలోనిది కాదని తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా బొంకటమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పొగాకు రైతులకు ఎంతమందికి రుణమాఫీ జరిగిం దో చేతులెత్తాలని కోరగా, రైతులంతా తమలో ఎవరికీ రుణమాఫీ కాలేదని నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధరలపై 10వ తేదీలోపు సర్కారు దిగిరాకుంటే రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని జగన్ హెచ్చరించారు.
అడుగడుగునా ఘన స్వాగతం
శనివారం ఉదయం 10.05 గంటలకు తూర్పుగోదావరి జిల్లానుంచి కొవ్వూరు బ్రిడ్జి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు జిల్లా నేతలు, కొవ్వూరు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉదయం 10.20 గంటలకు దొమ్మేరు చేరుకున్న జగన్ అల్లూరి సీతారామరాజు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు. దొమ్మేరులో సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. అక్కడి నుంచి దేవరపల్లి బయలుదేరారు. దారి పొడవునా గ్రామాల వద్ద తనకోసం వేచి ఉన్న ప్రజలను చూసి వాహనం ఆపి పలకరించి ముందుకు సాగారు.
ఎడ్లబండిపై వెళ్లిన జగన్ మధ్యాహ్నం 12.20 గంటలకు
దేవరపల్లి చేరుకుని అక్కడ ప్రధాన కూడలి నుంచి ఎడ్లబండిపై ప్రదర్శనగా పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం నల్లజర్ల, భీమడోలు, ఏలూరు మీదుగా విజయవాడ వెళ్లారు.
రైతు కోసం ఎందాకైనా
Published Sun, Jul 5 2015 12:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement