
ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలు: వైఎస్ జగన్
విజయనగరం : విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వానిది దిక్కుమాలిన ఆలోచనలు అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో 15వేల ఎకరాల సేకరణ ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న 350 ఎకరాలు చాలకుంటే వెయ్యి ఎకరాల వరకూ అక్కడే స్థల సేకరణ పరిశీలిస్తే బాగుంటుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
అలా కాకుండా భోగాపురంలో 15వేల ఎకరాలు సేకరించి రైతుల పొట్ట కొట్టడం ఎంతవరకూ న్యాయమన్నారు. విశాఖ సమీపంగా ఉన్న భోగాపురంలో ఎకరా రూ.2కోట్ల ధర పలుకుతోందని, భూములు సేకరించి 1000 లేదా 1500 గజాల స్థలం ఇస్తే వారంతా ఎక్కడికి వెళతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను అస్తవ్యస్థ పరిస్థితు్లోకి నెట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు.