ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎన్నికల హామీలు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నరసాపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎన్నికల హామీలు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టనున్న దీక్ష చరిత్రాత్మకమైందని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నరసాపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగుల కోసం జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు దాటుతున్నా హామీల అమలులో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి పోరాడేందుకు సిద్ధమయ్యారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అన్నం లేని వాడికి భోజనం పెట్టడం మానేసి సింగపూర్, జపాన్, మలేషియా జపంతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ గందరగోళమయంగా మారిందన్నారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని చెప్పారు. ప్రజలను సమీకరించి వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ప్రభుత్వం మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామని హెచ్చరించారు. ముందుగా నియోజకవర్గ శ్రే ణులతో కొత్తపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ సాగింది. అడుగడుగునా ప్రజలనుంచి మద్దతు లభించింది. వైఎస్సార్ సీపీ పార్టీ జిల్లా క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ సాయినాథ్‌ప్రసాద్, పాలంకి ప్రసాద్, దొంగ గోపి, షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, యర్రంశెట్టి బాబులు, పప్పులరామారావు తదితరులు పాల్గొన్నారు.