గార: జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగించిన తిత్లీ తుపాను, అనంతరం వచ్చిన వంశధార వరదతో ఇబ్బందులు పడిన ప్రజలవ్వెరూ అధైర్యపడవద్దని చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ రీజినల్ కో ఆర్డీనేటర్ ధర్మాన ప్రసాదరావుకు సూచించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ధర్మానతో ఆదివారం ఉదయం జగన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని గార మండలం తోనంగిలో పర్యటించిన సందర్భంగా ధర్మాన రైతులకు తెలియజేశారు. అనంతరం ప్రసాదరావు మాట్లాడుతూ..తుపానుతో జిల్లాలో వాటిల్లిన నష్టాని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీని పార్టీ అధినేత వేశారన్నారు. ఆ బాధ్యతలను తమకు అప్పగించడంతో మూడు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో పరిస్థితి, ప్రభుత్వ సాయంపై జగన్‌మోహన్‌రెడ్డి తమ నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లోనే జిల్లాకు వచ్చి రైతులతో మాట్లాడతానని, ఎవ్వరూ అధైర్యపడవద్దని పార్టీ శ్రేణుల ద్వారా భరోసా కల్పించాలని తెలిపారన్నారు. గతంలో సంభవించిన హుద్‌హుద్ తుపాను, గతేడాది అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం చంద్రబాబు తీరుకు నిదర్శనమని ధర్మాన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నానని, జిల్లాలో మకాం పెట్టానని చెప్పి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రస్తుతం జిల్లాలోని వరి పంటను చూస్తే దారణంగా దెబ్బ తిందన్నారు.
అయితే వ్యవసాయదారులు కాని వారు పంట బాగుందని అనుకుంటారని, వ్యవసాయం చేసిన వారికి పంట పాడైన సంగతి తెలుస్తుందన్నారు. చంద్రబాబు కూడా వ్యవసాయదారుడు కాకపోవడంతో రైతుల కష్టాలు ఆయనకు తెలియవని ధర్మాన వ్యాఖ్యానించారు. గతంలాంటి చంద్రబాబుని కాదని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఆయనలో మార్పు కలగలేదన్నారు. గడిచిన నాలుగు రోజులుగా రైతుల పరిస్థితి, ప్రభుత్వం ఏమి చేయాలి అనే నివేదిక చూశాక తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. తుపానుతో వరిపంట పూర్తిగా తుడిసిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పటికే 20 వేల రూపాయల వరకూ ఒక్కోరైతు పెట్టబడి పెట్టారని, అన్ని ఖర్చులు పూర్తయ్యాక తుపాను రూపంలో నష్టం వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందని, ఆ సంస్థకైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదకలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వమైనా సాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తుపాను ప్రభావిత గ్రామాల్లో మంచినీరు, భోజనం దొరకడం లేదన్నారు. టెక్కలి సబ్‌డివిజన్ కేంద్రానికే విద్యుత్‌లేకపోవడం చూస్తే రాష్ట్రంలో పెద్ద యంత్రాంగం ఉన్నా నిర్వీర్యం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం శ్రీకాకుళంలో కూర్చుంటానని, పడుకోనని చెబుతున్నారన్నారు. అయితే నష్టపోయిన బాధితులు మాత్రం ఏమి వస్తుందానని ఆలోచిస్తారన్నారు. తీరప్రాంతంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు.
ఈ తుపానులో కూడా పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, కవిటి, సోంపేటలో తాము పర్యటించిన సందర్భంగా అప్పట్లో వైఎస్ కట్టించిన ఇళ్లన్నీ సేఫ్‌గా ఉన్న విషయం వెలుగు చూసిందన్నారు. అయితే పూర్తిళ్లు మాత్రం దెబ్బ తిన్నాయన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో ఇళ్ల నిర్మాణాలే జరగలేదన్నారు. 5 లక్షల ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పర్యటనలో పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, పార్టీ నాయకులు మార్పు ధర్మారావు, ముంజేటి కృష్ణమూర్తి, పీస శ్రీహరిరావు, పీస గోపి, చల్ల రవికుమార్, బరాటం రామశేషు, సుగ్గు మధురెడ్డి, వమరవల్లి ఉదయభాస్కరరావు, కెప్టెన్ ఎర్రన్న, మైలపల్లి రాజేశ్వరరావు, గుంటు లకు‡్ష్మయ్య, రామచంద్రరరావు, కుడతాల రాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment