‘నయ వంచన’పై జగన్ పోరాటం
భీమవరం అర్బన్ : మోసపూరిత హామీలిచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నయవంచనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పో రాటం చేస్తున్నారని, దీనిలో భాగంగా తణుకులో ఈనెల 31, వచ్చేనెల 1న ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం బుధవారం భీమవరం వచ్చిన నాయకులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నివాసంలో సమావేశమయ్యారు.
పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రుణమాఫీ హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచి లక్షలాది మందికి పెన్షన్ అందకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నిలువునా ముంచారు
మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, పంట కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెబుతూ సీఎం చంద్రబాబు రైతులను వంచిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీలిచ్చి కేవలం రూ.10 వేలు రివాల్వింగ్ ఫండ్‌గా ఇస్తామనడం తగదన్నారు. బాబు వస్తే జాబు, నిరుద్యోగుల భృతి అంటూ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు వాటి అమలుకు ప్రయత్నించడం లేదని విమర్శించారు.
పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు
ప్రజా సమస్యలపై యువత ప్రశ్నిం చడం లేదని, మౌనంగా ఉండిపోతోందని చెబుతున్న సినీ నటుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో సమస్యలపై, అమలుకాని చంద్రబాబు హామీలపై ఎందుకు ప్రశ్నించడం లేదని భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తొలి సంతకం అంటూనే రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధ, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజు సూరి, మచిలీపట్నం మునిసిపాలిటీ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, ముదునూరి సుబ్బరాజు, కోడే యుగంధర్, మద్దాల సత్యనారాయణ పాల్గొన్నారు.