తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సార్వత్రిక ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఇక ఏ రోజైనా వెలువడవచ్చనే సంకేతాలు రావడంతో శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్ జగన్ జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో తటస్థులతోపాటు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న రెండు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు.
11వ తేదీన అనంతపురం, 13వతేదీన ప్రకాశం జిల్లాల్లో జరిగే సమావేశాల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలను పార్టీ నిర్వహించనుంది. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచక, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలికే విధంగా ఎన్నికల పోరాటానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. సుదీర్ఘ ప్రజాసంకల్ప పాద యాత్రతో రాష్ట్రం నలుమూలలా పర్యటించి ప్రజలను కలుసుకున్న జగన్ తటస్థులకు సైతం చేరువయ్యారు.
నిరంతరం ప్రజల్లోనే ప్రతిపక్ష నేత...
అధికారపక్షం అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో వైఎస్ జగన్ స్ఫూర్తిని నింపుతూ వచ్చారు. విభజన అనంతరం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను నిగ్గదీయటంతోపాటు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన అధికార పార్టీ సైతం హోదాకు జై అనక తప్పని పరిస్థితులను కల్పించారు. హోదా వద్దన్న చంద్రబాబు చివరకు ప్రజల ఆందోళనతో యూ టర్న్ తీసుకోక తప్పలేదు. పార్టీ ప్లీనరీ సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను సైతం హేళన చేసిన సీఎం చంద్రబాబు చివరకు వాటినే కాపీ కొట్టే పరిస్థితుల్లోకి వచ్చారు.
గత ఎన్నికల్లో అతి స్వల్ప శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనా నాలుగున్నరేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై జగన్ నిరంతరం పోరాడారు. కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కింది స్థాయి నుంచి బూత్ కమిటీల నిర్మాణంపై శ్రద్ధ వహించి పార్టీ నేతల సహకారంతో పటిష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎలా కృషి చేయాలనే అంశంపై సమర శంఖారావం సమావేశాల్లో జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇక తటస్థుల విషయానికి వస్తే ‘జగనన్న పిలుపు’ పేరుతో ఆయన ఇప్పటికే వారందరికీ లేఖలు రాశారు. జిల్లాలవారీగా తటస్థులతో సమావేశమై చంద్రబాబు సర్కారు దుర్నీతితోపాటు రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటింటికో ఉద్యోగం, బెల్ట్ షాపుల రద్దు లాంటి అంశాలపై మాటతప్పి మోసగించిన తీరును వారికి వివరించనున్నారు. టీడీపీ సర్కారు అరాచకాలు, రాజధాని నిర్మాణం పేరుతో భూ కుంభకోణాలు తదితర అంశాలను వివరించి ప్రజా కంటక పాలనను అంతమొందించేందుకు వారి సహకారాన్ని కోరనున్నారు.
నేటి కార్యక్రమం ఇలా...
తిరుపతిలో ‘సమర శంఖారావం’ సమావేశాలు బుధవారం రెండు విడతలుగా జరుగనున్నాయి. వైఎస్ జగన్ ఉదయం 12:45 గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని తనపల్లి క్రాస్ వద్ద గల పీఎల్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని మధ్యాహ్నం 1 గంటకు‘‘అన్న పిలుపు’’ కార్యక్రమంలో భాగంగా తటస్థులతో మాట్లాడతారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
అక్కడ సమావేశం అనంతరం వైఎస్ జగన్ రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మధ్యాహ్నం 2 గంట ప్రాంతంలో చేరుకుని పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో జరిగే ‘‘సమర శంఖారావం’’లో పాల్గొంటారని ఆయన వివరించారు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ( తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పీలేరు, పూతలపట్టు, చిత్తూరు, పుంగూరు, పలమనేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, కుప్పం )లకు చెందిన బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రెండు సమావేశాలు జరిగే వేదికల వద్ద ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురామ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు మంగళవారం పర్యవేక్షించారు. ప్రజలను కలుసుకున్న జగన్ తటస్థులకు సైతం చేరువయ్యారు. ఈ సమావేశానికి సుమారు 40 వేల మందికి పైగా కార్యకర్తలు హజరవుతారని అంచనా.
నెల్లూరు కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో ఈ నెల 12వ తేదీన జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావం కార్యక్రమం వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 11వ తేదీన అనంతపురం, 13వ తేదీన ప్రకాశం జిల్లాల్లో సమర శంఖారావం సభలు యథావిధిగా జరుగుతాయని, మార్పు ఉండబోదని ఈ విషయం పార్టీ శ్రేణులు గమనించాలని ఆయన మంగళవారం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment