సాక్షి, పోలవరం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో పోలవరానికి వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏమేరకు వచ్చాయి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏవిధమైన చర్యలు చేపట్టారని అడిగారు. నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు అంతరాయం కలిగితే ఎలా అని అన్నారు. గోదావరికి వరద వస్తే పనులు ఏవిధంగా సాగిస్తారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్ అంతకుముందు ఉండిలో వైఎస్సార్ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, ప్రసాద రాజు, దూలం నాగేశ్వరరావు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు, జిల్లా కలక్టర్ రేవు ముత్యాల రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోయ్యే మోషన్ రాజు, జిల్లా యూత్ అధ్యకుడు యోగేంద్ర బాబు, డీఐజీ అబ్దుల్ సత్తార్ ఖాన్‌లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
పోలవరానికి మూడోసారి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి వస్తుండగా, గతంలో రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. 2011 ఫిబ్రవరి 7న రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకూ హరిత యాత్ర పేరుతో 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్‌తో ఈ యాత్ర సాగింది. 2015 ఏప్రిల్ 15న ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన కోసం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు సీఎం హోదాలో ప్రాజెక్టును సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment