జగన్‌ బిజీ.. బిజీ | YS Jaganmohan Reddy busy with Activities | Sakshi
Sakshi News home page

జగన్‌ బిజీ.. బిజీ

Published Thu, Sep 26 2013 1:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

YS Jaganmohan Reddy busy with Activities

* రోజంతా తీరిక లేకుండా గడిపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత
* కార్యకర్తలు, అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు
* పార్టీ వేర్వేరు విభాగాల నేతలతో భేటీలు

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రోజంతా క్షణం తీరికలేకుండా గడిపారు. మంగళవారం బెయిల్‌పై విడుదలై ఆ రోజు రాత్రి 9.30 సమయంలో ఇంటికి చేరుకున్న జగన్‌.. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతూ గడిపారు. బుధవారం ఉదయం రాష్ట్రం నలుమూలల నుంచి జగన్‌ను కలిసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఒకవైపు వారిని పలకరిస్తూనే మరోవైపు పార్టీకి చెందిన వేర్వేరు విభాగాల నేతలతో రాత్రి పొద్దుపోయే వరకు భేటీలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలపై ఆరా తీయడమే కాకుండా భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో చర్చించారు.

ఉదయం 10.30 గంటలకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు జగన్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంట సేపు జరిగిన చర్చల్లో సమైక్య ఉద్యమానికి అండగా ఉంటానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 11.45 ప్రాంతంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకుపైగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకుని తక్షణ కర్తవ్యాన్ని వివరించారు. మధ్యాహ్నం 12.30 సమయంలో తన నివాసానికి తరలి వచ్చిన అభిమానులను చెరగని చిరునవ్వుతో పలకరించారు. దాదాపు మూడు గంటల సేపు ఓపికగా వారితో గడిపిన జగన్‌ చాలా ఆలస్యంగా మధ్యాహ్న భోజనానికి వెళ్లారు.

మళ్లీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో సమావేశాలు కొనసాగాయి. జగన్‌లో ఏమాత్రం మార్పు కనిపించలేదని, గతంలో ఎంత… సునిశితంగా ఆయా అంశాలను పరిశీలించి వివరించే వారో ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు.

హోరెత్తిన అభిమానం
దాదాపు 16 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలైన తమ నేతను కలుసుకోవడానికి రాష్టవ్య్రాప్తంగా పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బుధవారం జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే అభిమానులు లోటస్‌పాండ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకల్లా పరిసర ప్రాంతమంతా జగన్‌ అభిమానులతో కిక్కిరిసి పోయింది. వృద్ధులు, మహిళలు, యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు.

‘జై జగన్‌..’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత తమ ప్రియతమ నేతను స్వయంగా కలుసుకున్న ఆనందంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. జగన్‌తో కరచాలనం కోసం యువకులు పోటీపడ్డారు. తన కోసం వచ్చిన వారందరినీ ఆయన పలకరిస్తూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

అభిమానుల కోసం ప్రతిరోజూ..
జననేతను చూసేందుకు రాష్టవ్య్రాప్తంగా కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా తరలివస్తున్న నేపథ్యంలో వారెవర్నీ నిరాశపరచకూడదని జగన్‌ భావిస్తున్నారు. గురువారం నుంచి ప్రతిరోజూ ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆయన కలవనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement