ఉద్యోగుల తోపులాట.. సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనకు దిగారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అంటూ నినాదాలు చేయసాగారు. బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులు దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ నినాదాలు చేయసాగారు. ఎంతగా అదుపుచేసినా ఉద్యోగుల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.