
సాక్షి, అమరావతి: మొన్నటి వరకూ ఇసుక దందా ద్వారా దోచుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారే విమర్శలు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అవకాశం లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుకపై సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాక్ యార్డులు పెంచాలని, వరద తగ్గిన వెంటనే రీచ్‌ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు ఇసుక చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించాలన్నారు.
సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ఇందుకు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. కొత్తవిధానం అమలు ప్రారంభించిన వెంటనే వరదలతో రీచ్‌లు మునగడంవల్ల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను త్వరితగతిన అధిగమించి ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వరదలవల్ల వచ్చిన విరామ సమయాన్ని పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో కూడా అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండరాదన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిదిద్దుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరు ఎక్కడ ఇసుక అక్రమ తరలింపు, తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు.
నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి
ఎక్కడెక్కడ ఇసుకకు కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా ముందస్తుగా తెలియజేస్తే నిర్మాణదారులు తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు.
వరదలతో తీవ్ర ఇబ్బందులు
వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మొత్తం 102 రీచ్‌లకుగాను 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని వివరించారు. తవ్వి నదుల పక్కన పోసిన ఇసుక వరదల కారణంగా కొట్టుకుపోయిందని తెలిపారు. లంక భూములు కూడా మునిగిపోయాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మార్కెట్‌లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు అధిగమించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment