కర్నూల్‌ జిల్లాలో సమర శంఖం | YS Jaganmohan Reddy Will Election Campaign In The District From Panyam Constituency | Sakshi
Sakshi News home page

కర్నూల్‌ జిల్లాలో సమర శంఖం

Published Sun, Mar 17 2019 7:41 AM | Last Updated on Sun, Mar 17 2019 7:41 AM

YS Jaganmohan Reddy Will  Election Campaign In The District From Panyam Constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పాణ్యం నియోజకవర్గం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

అధికార పార్టీ గత ఎన్నికల ముందు జిల్లాకు, పాణ్యం నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పారిశ్రామిక హబ్‌గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామని, డీఆర్‌డీవో, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు వంటి హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. ఇక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ అనుమతులు లేక సగం సగం పనులు చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాను..అందులోనూ పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాటసాని తెలిపారు. ఈ అవినీతి, అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజాతీర్పుకు సూచికగా ఓర్వకల్లు సభ నిలవనుందని అభిప్రాయపడ్డారు.  

పాదయాత్ర తర్వాత... వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయన 2017 నవంబరు 14 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు మొత్తం 18 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. 14 నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నడక సాగించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల శంఖారావం సభల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి ఎన్నికల శంఖారావాన్ని పాణ్యం నియోజకవర్గంలో పూరించనున్నారని పేర్కొన్నారు.  

భారీగా కదలిరండి– కాటసాని రాంభూపాల్‌ రెడ్డి 
ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఓర్వకల్లులో జరిగే బహిరంగ సభలో మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఈ సభకు భారీగా తరలివచ్చి అధికార తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజలు చాటాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తరలిరావాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement