
సాక్షి, జమ్మలమడుగు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల‍్పయాత్ర నాలుగోరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల శివారులో ముగిసింది. పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట మండలంలో ఆయన ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు. పరిసర గ్రామాలలో అభిమానులు, కార్యకర్తలు నీరాజనలు పలికారు. మహిళలు వైఎస్ జగన్‌కు హారతులు పడుతూ, కుంకుమలు పెట్టి తమ సోదరుడిల భావించి రక్షబంధనం కట్టి తాము వేసిన ముగ్గులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
గురువారం ఉదయం 8.40 గంటలకు వైఎస్ జగన్ ఉరుటూరు శివారు నుంచి నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి సర్వరాజపేట మీదుగా పెద్దన్నపాడు చేరుకున్నారు. జగనన్నపై అభిమానులు పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. తర్వాత వైకోడూరు జంక్షన్‌లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్నదాతలను అన్నివిధాల ఆదుకుంటామని హామీయిచ్చారు. నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా 12.2 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ ఎర్రగుంట్ల శివారులో యాత్రను ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment