ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరిన జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రెండో రోజు మంగళవారం అడుగడుగునా ప్రజలు అఖండ స్వాగతం పలికారు. వేలాది మంది తమ అభిమాన నేత అడుగుల్లో అడుగులేస్తూ.. మా కష్టాలు తీరే రోజులు రానున్నాయని ఆనంద పరవశులయ్యారు. అందరి సమస్యలు వింటూ.. కష్టాలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. మహిళలు.. వృద్ధులు.. విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఉద్యోగులు.. రైతులు.. వికలాంగులు.. ఇలా ఒక్కరేమి.. అన్ని వర్గాల వారికి తాను అండగా ఉంటానని ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం రెండో రోజు పాదయాత్ర జోరుగా, హుషారుగా సాగింది. వేంపల్లెలో పాదయాత్ర సాగే మార్గంలో జనం లేకుండా చేయడానికి పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజాగ్రహంతో తుస్సుమన్నాయి. తమ అభిమాన నాయకుడికి జనం అడుగడుగునా హారతులు ఇచ్చి ఆయన్ను పలుకరించి, చేతులు కలిపి, ఆశీర్వదించి కానీ ముందుకు పంపలేదు. దీంతో పాదయాత్ర నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాగింది. వేంపల్లె వాసులు ఊహించని విధంగా జగన్‌కు అఖండ స్వాగతం పలికారు. వేంపల్లె శివారులోని రాత్రి బస నుంచి మంగళవారం ఉదయం 8–45 గంటలకు బయటకు వచ్చిన జగన్ పులివెందుల నియోజక వర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిపారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించి 9–50 గంటలకు వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి రావాల్సి ఉంది.
అయితే ఈ మార్గంలో అడుగడుగునా ప్రజలు భారీ సంఖ్యలో జగన్ కోసం వేచి చూశారు. తన కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆయన పలుకరిస్తూ ముందుకు సాగారు. దీంతో చాలా ఆలస్యంగా మధ్యా హ్నం 12–15 గంటలకు ఆయన నాలుగు రోడ్ల కూడలికి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచే జగన్ కోసం నాలుగు రోడ్ల కూడలిలో ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలు, జనం మీద పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు పక్కన కూడా జనం గుమికూడరాదని హుకుం జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలతో నాలుగు రోడ్ల కూడలి నుంచి బస్టాండ్ వరకు హాటళ్లు, ఇతర దుకాణాలన్నీ మూసి వేయడంతో వ్యాపారులు నష్టపోవడంతో పాటు, యాత్రకు వచ్చిన వారికి టిఫిన్, టీ, కాఫీ లాంటివి దొరక్క ఇబ్బంది పడ్డారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. పోలీసులు వారిని అడ్డుకుని కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసు హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా జనం పెద్ద సంఖ్యలో తిరగబడటంతో పోలీసులు మిన్నకుండి పోవాల్సి వచ్చింది. జగన్ నాలుగు రోడ్ల సర్కిల్‌కు చేరుకోవడంతోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయన అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగారు. జగన్‌ను చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి మహిళలు, యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఇక్కడి నుంచి ఒకటిన్నర కిలో మీటర్ దూరంలోని శ్రీనివాస కల్యాణ మండపానికి చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది.
జెడ్‌పీ హైస్కూల్ వద్ద టీచర్లు జగన్‌ను కలసి సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నిర్వహించిన మొదటి రచ్చ బండ కార్యక్రమం 3–45 గంటలకు ముగిసింది. ఇక్కడ కూడా జగన్‌కు తమ బాధలు చెప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున హాజరైన మహిళలు మూడు గంటల పాటు ఎదురు చూశారు. జగన్ రావడంతోనే వారిలో ఉత్సాహం పెరిగి ఆయనతో తమ కష్టాలు పంచుకున్నారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించిన జగన్ సాయంత్రం 4–50 గంటలకు పత్తి పంట కోల్పోయిన కౌలు రైతు జయన్నకు ధైర్యం చెప్పి ముందుకు సాగారు. హైవే మీద కూడా జనం భారీ సంఖ్యలో ఆయన వెంట అడుగులో అడుగు వేశారు.
సాయంత్రం 5–20 గంటలకు మధ్యాహ్న భోజన విడిదికి చేరుకున్న జగన్ 10 నిమిషాల్లోనే మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. యురేనియం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌ను కలిసి తమ కాంట్రాక్టు సంస్థ ఇబ్బందులు కల్పిస్తోందని ఫిర్యాదు చేశారు. జగన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌తో మాట్లాడారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. రాత్రి 7–40 గంటలకు మర్రిపల్లె క్రాస్‌కు చేరుకుని అక్కడి నుంచి రాత్రి 8–30 గంటలకు నేల తిమ్మాయ పల్లిలోని బసకు చేరుకున్నారు. రెండో రోజు పాదయాత్ర ఇలా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment