
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో ముగిసింది. 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర మదనాంతపురం క్రాస్, జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా, చెరువుతండా వరకు నేడు 10.6 కిలోమీటర్లు వైఎస్ జగన్ నడిచారు. కాగా, కర్నూలు జిల్లాలో 18 రోజులపాటూ 7 నియోజక వర్గాలు 14 మండలాల్లో 240 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించారు. కడప జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మొత్తం 356.8 కిలోమీటర్లు నడిచారు.
నవంబర్ 14న కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర 18 రోజులపాటు కొనసాగి డిసెంబర్ 3న ముగిసింది. రేపటి (డిసెంబర్ 4వ తేదీ) నుంచి అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది.