* రెండు ప్రత్యేక రైళ్లలో దేశ రాజధానికి
* 17న ఢిల్లీ నడిబొడ్డున జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘సమైక్య ధర్నా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తన వాణిని దేశ రాజధాని ఢిల్లీలో బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సమైక్య ధర్నా’ నిర్వహించనుంది. తద్వారా అడ్డగోలుగా విభజనకు పాల్పడుతున్న యూపీఏ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా చేయాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి.
ఈ మేరకు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరనున్నాయి. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ ధర్నా ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు.
ఢిల్లీ నడిబొడ్డున సమైక్యధర్నా ద్వారా యూపీఏ పెద్దలకు తెలుగుప్రజల మనోభావాలను తెలియజేస్తామని చెప్పారు. రెండు రోజులుగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమైక్యబంద్ విజయవంతమైందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇప్పటికే 8 పార్టీలు గళం విప్పాయని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘‘చంద్రబాబు తన వాదనను స్పష్టం చేయాలి. అటుఇటు కాని వాదనతో కొబ్బరిచిప్పల సిద్ధాంతం ద్వారా తెలుగుప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ ఒకరకంగా నష్టం కలిగిస్తే, బాబు తానిచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోకుండా ఇక్కడిదాకా తెచ్చారు. తెలుగుజాతికి మద్దతుగా బాబు సమైక్య జెండా పట్టుకోవాలి. చివరిక్షణంలోనైనా బాధ్యత తీసుకుని మాతోపాటు ధర్నాకు కూర్చొని తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి’’ అని ఆమె సూచించారు.
అనుమతి ఇవ్వొద్దు: టీఎస్ జేఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర పరిరక్షణ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన సభలకు అనుమతి నిరాకరించడంతోపాటు సీమాంధ్ర ఉద్యమకారులతో ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి ఐకాస(టీఎస్‌జేఏసీ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఐకాస నేతలు శుక్రవారం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో హింసకు పాల్పడి తెలంగాణను అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని టీఎస్‌జేఏసీ నేత పిడమర్తి రవి ఆరోపించారు. సమావేశంలో పున్నా కైలాశ్ నేత, బారకొండ వెంకటేశ్, రమేశ్ ముదిరాజ్, రాస వెంకట్ ముదిరాజ్ పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్‌సీపీ చలో ఢిల్లీ
Published Sat, Feb 15 2014 3:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement