samaikya strike
-
నేడు వైఎస్సార్సీపీ చలో ఢిల్లీ
-
నేడు వైఎస్సార్సీపీ చలో ఢిల్లీ
* రెండు ప్రత్యేక రైళ్లలో దేశ రాజధానికి * 17న ఢిల్లీ నడిబొడ్డున జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ‘సమైక్య ధర్నా’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తన వాణిని దేశ రాజధాని ఢిల్లీలో బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సమైక్య ధర్నా’ నిర్వహించనుంది. తద్వారా అడ్డగోలుగా విభజనకు పాల్పడుతున్న యూపీఏ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా చేయాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ మేరకు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరనున్నాయి. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు వాసిరెడ్డి పద్మ, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ ధర్నా ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి పౌరుషానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలిపారు. ఢిల్లీ నడిబొడ్డున సమైక్యధర్నా ద్వారా యూపీఏ పెద్దలకు తెలుగుప్రజల మనోభావాలను తెలియజేస్తామని చెప్పారు. రెండు రోజులుగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమైక్యబంద్ విజయవంతమైందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇప్పటికే 8 పార్టీలు గళం విప్పాయని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘‘చంద్రబాబు తన వాదనను స్పష్టం చేయాలి. అటుఇటు కాని వాదనతో కొబ్బరిచిప్పల సిద్ధాంతం ద్వారా తెలుగుప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ ఒకరకంగా నష్టం కలిగిస్తే, బాబు తానిచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోకుండా ఇక్కడిదాకా తెచ్చారు. తెలుగుజాతికి మద్దతుగా బాబు సమైక్య జెండా పట్టుకోవాలి. చివరిక్షణంలోనైనా బాధ్యత తీసుకుని మాతోపాటు ధర్నాకు కూర్చొని తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి’’ అని ఆమె సూచించారు. అనుమతి ఇవ్వొద్దు: టీఎస్ జేఏసీ సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర పరిరక్షణ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన సభలకు అనుమతి నిరాకరించడంతోపాటు సీమాంధ్ర ఉద్యమకారులతో ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి ఐకాస(టీఎస్‌జేఏసీ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఐకాస నేతలు శుక్రవారం ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో హింసకు పాల్పడి తెలంగాణను అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని టీఎస్‌జేఏసీ నేత పిడమర్తి రవి ఆరోపించారు. సమావేశంలో పున్నా కైలాశ్ నేత, బారకొండ వెంకటేశ్, రమేశ్ ముదిరాజ్, రాస వెంకట్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు
నేటి నుంచి నిరసన కార్యక్రమాలు: ఏపీఎన్జీవోలు సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలి పారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల దహనం, ఎంపీల ఇళ్లముందు ధర్నాలు, 10న బ్యాంకులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 11న థియేటర్లు, వాణిజ్య సంస్థల మూసివేత, 12న జాతీయ రహదారుల దిగ్భంధం చేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేతనాలను త్యాగం చేసి ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తుంటే, సీమాంధ్ర కేంద్ర మంత్రులు సకల సౌకర్యాలు అనుభవిస్తుండడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 21వరకు జరగనున్న సమైక్య సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
ఈ ఒక్క వారమైనా డ్యూటీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను నేపథ్యంలో సమైక్య సమ్మెకు కొంత విరామం ప్రకటించి ఈ ఒక్క వారమైనా పూర్తిస్థాయి విధుల్లోకి రావాలని డిప్యూటీ కలెక్టర్లకు సర్కారు విజ్ఞప్తి చేసింది. సమ్మె చేస్తూనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవ చేస్తామన్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం వాదనతో ప్రభుత్వం ఏకీభవించలేదు. సమ్మెలో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టమని, ఆయా కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కనుక, సమ్మె చేస్తూ ఆర్థిక పరమైన అంశాల జోలికి పోరాదని పేర్కొంటూ ఈ వారం రోజులు విధుల్లో చేరాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సంఘం గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇదిలావుంటే, సంఘం ప్రతినిధు లు బుధవారం సీఎంతో భేటీ అయ్యారు. సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని సంఘం అధ్యక్షుడు పిడుగు బాబూరావు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు స్పష్టం చేశారు. -
రేపు సీఎంతో ఉద్యోగుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: సమైక్య సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చర్చలు జరపనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. సీఎం స్థాయిలో అయితేనే చర్చలు జరుపుతామని వారు తెగేసి చెప్పడంతో విషయాన్ని మంత్రులు కిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వారితో కిరణ్ చర్చలు జరపనున్నారని అనంతరం వారు వెల్లడించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా విద్యుత్, ఆర్టీసీలకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆ ప్రసక్తే లేదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. తర్వాత సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట వేదిక ప్రతినిధులతో మంత్రులు చర్చించారు. టీచర్ల సమ్మె వల్ల పేద విద్యార్థులే నష్టపోతున్నారు గనుక విరమించాలన్న కొండ్రు విజ్ఞప్తికి వారు ఘాటుగానే స్పందించారు. విభజన వల్ల వారు అంతకంటే ఎక్కువగా నష్టపోతారనే విషయాన్ని గుర్తించాలన్నారు. జేఏసీ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామే తప్ప తమంత తాముగా సమ్మె విరమించే అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పష్టమైన హామీ వచ్చేదాకా సమ్మెను విరమించబోమని సచివాలయ ఉద్యోగులు కూడా స్పష్టం చేశారు. ఉద్యమంలో హింస చోటు చేసుకుంటున్నందున సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు ఉపసంఘం సూచించింది. పార్టీలు ఉద్యమంలోకి వచ్చినందున ఉద్యోగులు ఇక విధుల్లో చేరాలని కోరింది. కరెంట్ లేక ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలూ నిలిచిపోయాయని, మోటార్లు పనిచేయక తాగునీటి సమస్య వచ్చిందని, రైతులూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తమ్ముడు వివేకా వ్యాఖ్యలకు విలువ లేదు: ఆనం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను రీకాల్ చేయాలన్న ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యలకు విలువ లేదని ఆయన సోదరుడు, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. దిగ్విజయ్ అద్భుతంగా పని చేస్తున్నారని, ఆయన ఇన్చార్జిగా ఉండటం తమ అదృష్టమన్నారు. సమైక్యోద్యమంలో మిగతా పార్టీలకు కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారని తెలిపారు. హేతుబద్దమైన ముగింపెలా? ఉద్యోగ సంఘాల తర్జనభర్జన ‘‘సమ్మెకు ముగింపు పలుకుదామా? మరింత ఉధృతం చేద్దామా? సమ్మె విరమించి, ఉద్యమం కొనసాగిస్తాం అంటూ ప్రకటిద్దామా? సీఎం నుంచి ఎలాంటి హామీ వస్తే సమ్మె విరమణకు అవకాశముంటుంది? ఇన్ని రోజులుగా చేస్తున్న సమ్మెకు హేతుబద్ధమైన ముగింపు ఎలా ఇవ్వగలం? జీతాలు రాక కిందిస్థాయి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు. మరో నెల కూడా జీతాలు రాకుంటే ఎలా? బ్యాంకు రుణాలతో ఉద్యోగులు ఎంతకాల నెట్టుకురాగరు? మరింత తీవ్రంగా పోరాటం చేస్తే ఫలితం వస్తుందా? ఆఖరు దశగా మరింత ఉధృతంగా సమ్మె చేస్తే ఎలా ఉంటుంది?’’ - సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్న తర్జనభర్జన ఇది! బుధవారం కిరణ్‌తో జరిగే చర్చల్లో ఏయే అంశాలను ప్రస్తావించాలనే విషయంలో వాటి నేతలు చర్చల్లో మునిగిపోయారు. ఆయన స్పందన చూశాక భావి కార్యాచరణ ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. కిరణ్‌తో చర్చల్లో ‘హేతుబద్దమైన ముగింపు’ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం హామీ ఇస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే అవకాశముంది.