
రేపు సీఎంతో ఉద్యోగుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: సమైక్య సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చర్చలు జరపనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. సీఎం స్థాయిలో అయితేనే చర్చలు జరుపుతామని వారు తెగేసి చెప్పడంతో విషయాన్ని మంత్రులు కిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వారితో కిరణ్ చర్చలు జరపనున్నారని అనంతరం వారు వెల్లడించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా విద్యుత్, ఆర్టీసీలకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆ ప్రసక్తే లేదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.
తర్వాత సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట వేదిక ప్రతినిధులతో మంత్రులు చర్చించారు. టీచర్ల సమ్మె వల్ల పేద విద్యార్థులే నష్టపోతున్నారు గనుక విరమించాలన్న కొండ్రు విజ్ఞప్తికి వారు ఘాటుగానే స్పందించారు. విభజన వల్ల వారు అంతకంటే ఎక్కువగా నష్టపోతారనే విషయాన్ని గుర్తించాలన్నారు. జేఏసీ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామే తప్ప తమంత తాముగా సమ్మె విరమించే అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పష్టమైన హామీ వచ్చేదాకా సమ్మెను విరమించబోమని సచివాలయ ఉద్యోగులు కూడా స్పష్టం చేశారు. ఉద్యమంలో హింస చోటు చేసుకుంటున్నందున సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు ఉపసంఘం సూచించింది. పార్టీలు ఉద్యమంలోకి వచ్చినందున ఉద్యోగులు ఇక విధుల్లో చేరాలని కోరింది. కరెంట్ లేక ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలూ నిలిచిపోయాయని, మోటార్లు పనిచేయక తాగునీటి సమస్య వచ్చిందని, రైతులూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
తమ్ముడు వివేకా వ్యాఖ్యలకు విలువ లేదు: ఆనం
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను రీకాల్ చేయాలన్న ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యలకు విలువ లేదని ఆయన సోదరుడు, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. దిగ్విజయ్ అద్భుతంగా పని చేస్తున్నారని, ఆయన ఇన్‌చార్జిగా ఉండటం తమ అదృష్టమన్నారు. సమైక్యోద్యమంలో మిగతా పార్టీలకు కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారని తెలిపారు.
హేతుబద్దమైన ముగింపెలా?
ఉద్యోగ సంఘాల తర్జనభర్జన
‘‘సమ్మెకు ముగింపు పలుకుదామా? మరింత ఉధృతం చేద్దామా? సమ్మె విరమించి, ఉద్యమం కొనసాగిస్తాం అంటూ ప్రకటిద్దామా? సీఎం నుంచి ఎలాంటి హామీ వస్తే సమ్మె విరమణకు అవకాశముంటుంది? ఇన్ని రోజులుగా చేస్తున్న సమ్మెకు హేతుబద్ధమైన ముగింపు ఎలా ఇవ్వగలం? జీతాలు రాక కిందిస్థాయి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు. మరో నెల కూడా జీతాలు రాకుంటే ఎలా? బ్యాంకు రుణాలతో ఉద్యోగులు ఎంతకాల నెట్టుకురాగరు? మరింత తీవ్రంగా పోరాటం చేస్తే ఫలితం వస్తుందా? ఆఖరు దశగా మరింత ఉధృతంగా సమ్మె చేస్తే ఎలా ఉంటుంది?’’ - సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్న తర్జనభర్జన ఇది! బుధవారం కిరణ్‌తో జరిగే చర్చల్లో ఏయే అంశాలను ప్రస్తావించాలనే విషయంలో వాటి నేతలు చర్చల్లో మునిగిపోయారు. ఆయన స్పందన చూశాక భావి కార్యాచరణ ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. కిరణ్‌తో చర్చల్లో ‘హేతుబద్దమైన ముగింపు’ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం హామీ ఇస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే అవకాశముంది.