గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో వివరించిన జగన్
సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ మాఫియా మహిళల పట్ల ఎలా ప్రవ ర్తించిందీ, వారి వెనుక టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మంత్రుల అండ ఎలా ఉన్నదీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో వివరించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ విజయవాడ మాఫియాలకు అడ్డాగా మారిందని వివరించారు. డబ్బు అవసరమున్న మహిళలకు అధిక వడ్డీలకు రుణాలిచ్చి వారిని ఎలా సెక్స్ రాకెట్ ఊబిలోకి లాగిందీ, దోచుకున్నదీ తెలిపారు. వాటిలోని ముఖ్యాంశాలివీ...
* తన కుమార్తె ఉన్నత చదువుల కోసం కాల్‌మనీకి సంబంధించిన వారిని సంప్రదించిన మహిళను, కుమార్తెను వ్యభిచారంలోకి లాగాలని చూడటంతో ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రాకెట్ బద్దలైంది. సెవెన్ సిస్టర్స్ ఏజెన్సీని నడుపుతున్న ఓ ప్రైవేటు ఫైనాన్సియర్ రూ.మూడు లక్షల రుణాన్ని తీర్చలేదని తన కుమార్తె, అల్లుడిని అపహరించుకు వెళ్లిన ఉదంతంపై మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రుణంపై 30 శాతం అధిక వడ్డీని విధించారు. ఈ గ్యాంగ్ అమాయకులైన మహిళలకు రుణాలను అత్యధిక వడ్డీలకు ఇచ్చి, వారు చెల్లించలేకపోతే వారి ఇళ్లను, పొలాలను బలవంతంగా బెదిరించి తమ పేరిట బదలాయించుకుంటారు. కొన్ని ఉదంతాల్లో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడమే కాక వారి వీడియోలను తీసి ఎప్పటికీ వారు అదే ఊబిలో ఉండిపోయేలా చేస్తారు. ఇలా మహిళలపై తీసిన ఎన్నో వీడియో టేపులు బయటపడ్డాయి.
* కాల్‌మనీ వ్యవహారంలో ఉన్న గ్యాంగ్ ఆర్థిక సహకారంతోనే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ విహారాలకు వెళ్లారని వెల్లడైంది. వీరు పోలీసు అధికారులకు కూడా లంచాలిచ్చి తమపై ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాల్‌మనీ వ్యవహారం నడుపుతున్న వారితో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో కలసి ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఏ మేరకు ఈ వ్యవహారంలో మునిగారో అర్థం అవుతుంది. ఈ వడ్డీ వ్యాపారం క్రమంగా సెక్స్ రాకెట్‌గా మారింది.
* తన పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ వంటి వారు తప్పులు చేసినా ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడం, కేసులు పెట్టక పోవడంతోనే పోలీసులు అధికార పార్టీ వారి జోలికి వెళ్లాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. దీనిని టీడీపీ నేతలు కూడా అలుసుగా తీసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో 2014 ఆగస్టులో విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ పార్టీ కార్యకర్తలకు, నేతలకు సహకరించాలని వారిని ఆదేశించడంతోనే ఇలాంటి మాఫియాలు చెలరేగడానికి కారణమైంది. తమ పార్టీ వారికి సహకరించి మళ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా సహకరించాలని చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించినట్లుగా ‘టైమ్స్ గ్రూప్-ఈ పేపర్’లో 2014 ఆగస్టు 8వ తేదీన వచ్చిన వార్తల పూర్తి వివరాలను గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో తొలుతనే జగన్ ప్రస్తావించారు.