వైఎస్ పాదయాత్రతోనే సంక్షేమ పాలన | YS padayatratone welfare regime | Sakshi
Sakshi News home page

వైఎస్ పాదయాత్రతోనే సంక్షేమ పాలన

Published Thu, Apr 9 2015 11:56 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

YS padayatratone welfare regime

ప్రజాప్రస్థానం 12వ వార్షికోత్సవంలో వైఎస్ జగన్
పిల్లల చదువు, వైద్య చికిత్స..పేదలు అప్పుల్లో కూరుకుపోయేవిగా వైఎస్ గుర్తించారు
ఈ సమస్యలను వారికి లేకుండా చేసేందుకే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు
ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఆయనదే
చంద్రబాబు తొమ్మిదేళ్లలో 17 లక్షల పింఛన్లు ఇస్తే.. వైఎస్ 78 లక్షల పింఛన్లు ఇచ్చారు
మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
ఆ పరిపాలన ఇచ్చే దిశగా కలసి కృషిచేద్దాం పార్టీ శ్రేణులకు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు


సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం వల్లనే ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే ఎవరూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పాలనను అందించారని, ఇప్పటికీ ఆయన పాలన మనందరికీ స్ఫూర్తిగా నిలిచిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదవాడు అప్పుల్లో కూరుకుపోయేది ప్రధానంగా తన పిల్లల చదువులకయ్యే ఖర్చుకోసం, రెండోది ఆరోగ్యం ప్రమాదకరంగా దెబ్బతిన్నప్పుడు చికిత్సకయ్యే ఖర్చుకోసం అనే విషయాలను వైఎస్ గుర్తించారని, ఈ రెండు సమస్యలను ప్రజలకు లేకుండా చేసేందుకే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో 1,475 కిలోమీటర్ల మేరకు 11 జిల్లాల్లో పాదయాత్ర చేసి సరిగ్గా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏడాదికి పేదలకోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించడమే గగనమైందని, కానీ వైఎస్ ఏటా పది లక్షల ఇళ్లను నిర్మించారని జగన్ తెలిపారు.

మొత్తం ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్‌దేనన్నారు. చంద్రబాబు 17 లక్షల పింఛన్లు ఇస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 78 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు కనుకనే వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. మళ్లీ వైఎస్సార్ పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ పరిపాలన ఇచ్చే దిశగా అంతా కలసి కృషి చేద్దామని జగన్ అన్నారు.
 
వైఎస్ పాదయాత్ర చరిత్రాత్మకం...

దివంగత వైఎస్సార్ 12 ఏళ్ల కిందట చేసిన పాదయాత్ర చరిత్రాత్మకమైందని, మలమల మాడే ఎండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన ఈ సుదీర్ఘమైన యాత్ర చేశారని జగన్ అన్నారు. భయంగొలిపే ఎండల్లో వైఎస్ పాదయాత్ర చేసిన ఫలితంగా ఆయనకు వడదెబ్బ సోకి వారం రోజులపాటు అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో తాను కూడా రాజమండ్రికి వెళ్లి చూశానని  జగన్ తన తండ్రి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.

 ‘‘ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారు యూజర్ చార్జీల దగ్గరి నుంచి కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీల వంటివన్నీ పెంచేసి ప్రజలను వరుసగా బాదేస్తూ ఉండేది. ప్రజలపై భారం మోపడానికే ఈ సర్కారు ఉన్నదా! అనేలా బాబు పాలిస్తూ ఉండేవారు. చార్జీల వాతలిలా ఉంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులుండేవి. ఒక హెచ్‌పీ విద్యుత్‌కు అప్పటిదాకా ఉన్న చార్జీని రూ.50 నుంచి 665 రూపాయలకు చంద్రబాబు అప్పట్లో పెంచేశారు’’ అని ఆయన గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే... ‘అపుడు కరెంటు తీగలు బట్టలారేసుకోవడానికే పనికి వస్తాయి...’ అని చంద్రబాబు అవ హేళన చేశారన్నారు.

ప్రజలు పడుతున్న బాధల్లో వారికి తోడుగా నిలబడి.. మీకు అండగా ఉండటానికి మేమొస్తున్నామని వైఎస్ ఒక భరోసాను పాదయాత్రలో ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ వైద్య విభాగం నేత గోసుల శివభరత్‌రెడ్డి, హిందూపురం లోక్‌సభా నియోజకవర్గం వైసీపీ నేత డి.శ్రీధర్ , తెలంగాణకు చెందిన నేత సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement